నెల్లూరు జిల్లా రామాపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో పారిశుద్ధ్యం నిర్వహించడానికి బ్లీచింగ్ పౌడర్ కూడా లేని దుస్థితి ఉండేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీలు తమ గ్రామ అభివృద్ధి ప్రణాళికలను తామే స్వయంగా రూపొందించుకుని అమలు చేసుకునే స్థాయికి స్వయం పాలనను తీసుకొచ్చామని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు సంపూర్ణ మద్దతుతో రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖను సమూలంగా బలోపేతం చేశామని ఆయన పేర్కొన్నారు.
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై గణాంకాలను వివరిస్తూ.. గత ప్రభుత్వ హయాంలో కేవలం 880 కిలోమీటర్ల సీసీ రోడ్లు మాత్రమే నిర్మిస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే ఏకంగా 9,000 కిలోమీటర్లకు పైగా సీసీ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసిందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అలాగే గతంలో కేవలం 304 మినీ గోకులాలను నిర్మిస్తే, ప్రస్తుతం రైతులకు, పాడి పరిశ్రమకు దన్నుగా నిలుస్తూ 30,000కు పైగా మినీ గోకులాల నిర్మాణాన్ని చేపట్టామని వివరించారు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,326 పంచాయతీలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని, ప్రస్తుతం మరో 10,000 కిలోమీటర్ల మేర బీటీ రోడ్ల పనులు కూడా వేగంగా పురోగతిలో ఉన్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలా ఏళ్లపాటు పాలకులు గ్రామాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడంతో పల్లెల నుంచి ప్రజలు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, కూటమి ప్రభుత్వ చొరవతో నేడు గ్రామాల ముఖచిత్రం పూర్తిగా మారిపోతోందని కొనియాడారు. కాగా, గ్రామీణ రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు సుమారు 2,700 కోట్ల రూపాయలతో 6,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 7,550 కోట్ల రూపాయలతో బీటీ రోడ్ల నిర్మాణంతో పాటు పంచాయతీ భవనాలు, బస్ షెల్టర్లు, భూగర్భ డ్రైనేజీ పనులను ప్రభుత్వం శరవేగంగా చేపడుతోంది. ఈ భారీ నిర్మాణ పనుల ద్వారా స్థానిక గ్రామీణ కూలీలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్నాయి.
