Latest Posts

రెండో వన్డేలో సిరీస్‌ కైవసమే లక్ష్యం…

వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలివుండగానే కైవసం చేసుకునేందుకు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు గువాహటిలోని బర్సపారా క్రికెట్ స్టేడియం వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. తొలి వన్డేలో విరాట్ కోహ్లీ కేవలం 88 బంతుల్లో 139 పరుగులతో అజేయ సుడిగాలి సెంచరీ బాదగా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 110 పరుగులతో శతక్కొట్టడంతో భారత్ 296 పరుగుల భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌తో పాటు జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

గువాహటి మైదానం టీమిండియాకు తిరుగులేని అచ్చొచ్చిన వేదికగా రికార్డు సృష్టించింది. ఇక్కడ ఇప్పటివరకు ఆడిన రెండు వన్డేల్లోనూ భారత్ ఘనవిజయాలు సాధించగా, ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ విరాట్ కోహ్లీ అద్భుత శతకాలు బాది సెంటిమెంట్‌ను కొనసాగించాడు. మరోవైపు రోహిత్ శర్మ సైతం ఇక్కడ ఒక సెంచరీ, ఒక అర్ధసెంచరీతో సత్తా చాటాడు. ఈ పిచ్‌పై ఇప్పటివరకు జరిగిన నాలుగు వన్డే ఇన్నింగ్స్‌లలోనూ 300కు పైగా స్కోర్లు నమోదు కావడంతో, రెండో వన్డేలోనూ పరుగుల వరద పారే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

సిరీస్ విజయమే ధ్యేయంగా బరిలోకి దిగుతున్న భారత జట్టు తుది కూర్పులో కొన్ని మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తొలి వన్డేలో బెంచ్‌కే పరిమితమైన యువ సంచలనం యశస్వి జైస్వాల్‌తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్‌కు తుది జట్టులో చోటు కల్పించే ఆలోచనలో మేనేజ్‌మెంట్ ఉన్నట్లు సమాచారం. తొలి మ్యాచ్‌లో విండీస్ ఓపెనర్లు 135 పరుగుల భాగస్వామ్యంతో దూకుడు ప్రదర్శించిన వేళ, కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పిన నేపథ్యంలో.. రెండో వన్డేలోనూ స్పిన్ మాయాజాలంతో పాటు బ్యాటర్లు చెలరేగితే భారత్ ఖాతాలో మరో వన్డే సిరీస్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

Editor