తాడిమర్రి (yes9tv )ఖరీఫ్–2026: 40 శాతం రాయితీపై 1,840 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాల పంపిణీ – రైతులు నమోదు చేసుకోవాలి
తాడిమర్రి, జూన్ 4: ఖరీఫ్–2026 సీజన్‌కు సంబంధించి తాడిమర్రి మండలంలోని 10 రైతు సేవా కేంద్రాల పరిధిలో రైతులకు 40 శాతం రాయితీపై వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
మండలానికి మొత్తం 1,840 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు కేటాయించబడ్డాయి. ఇందులో కే–2026 రకం 1,100 క్వింటాళ్లు, కే–1812 రకం 90 క్వింటాళ్లు, టి.సి.జి.ఎస్–316 రకం 650 క్వింటాళ్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
40 శాతం రాయితీ అనంతరం రైతులు చెల్లించాల్సిన ధరలు ఇలా ఉన్నాయి. కే–2026 మరియు టి.సి.జి.ఎస్–316 రకాల విత్తనాలకు క్వింటాల్‌కు రూ.1,836, కే–1812 రకానికి క్వింటాల్‌కు రూ.1,710 నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు.
వర్షాలు సకాలంలో కురుస్తున్న నేపథ్యంలో రైతులు వేరుశనగ సాగుకు సిద్ధమవుతున్నారని, విత్తనాలు పొందదలచిన రైతులు తమ పరిధిలోని రైతు సేవా కేంద్రాలను సంప్రదించి వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు. రైతులు ఆలస్యం చేయకుండా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని రాయితీ విత్తనాలను పొందాలని కోరారు.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం భూ విస్తీర్ణాన్ని ఆధారంగా చేసుకుని విత్తనాల పంపిణీ జరగనుంది. అర ఎకరం నుండి ఒక ఎకరం వరకు భూమి కలిగిన రైతులకు ఒక బస్తా (30 కిలోలు), ఒక ఎకరం నుండి రెండు ఎకరాల వరకు సాగు చేసే రైతులకు రెండు బస్తాలు (60 కిలోలు), రెండు ఎకరాలకు పైగా భూమి కలిగిన రైతులకు మూడు బస్తాలు (90 కిలోలు) 40 శాతం రాయితీపై అందజేయనున్నారు.
అలాగే రైతులు విత్తనాలు విత్తే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేపట్టాలని వ్యవసాయ శాఖ సూచించింది. మువ్వకుళ్లు, వేరుపుండ్లు వంటి తెగుళ్ల నివారణ కోసం కిలో విత్తనానికి క్లోరోపైరిఫాస్ 20 మిల్లీలీటర్లు, ఇమిడాక్లోప్రిడ్ 4 మిల్లీలీటర్లు, కార్బెండాజిమ్ 5 గ్రాములు ఉపయోగించి విత్తన శుద్ధి చేసిన అనంతరం విత్తుకోవాలని అధికారులు సూచించారు.
రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం అందిస్తున్న రాయితీ విత్తనాలను పొందాలని వ్యవసాయ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాడిమర్రిలో 40% రాయితీపై వేరుశనగ విత్తనాల పంపిణీ: రైతులు నమోదు చేసుకోవాలని అధికారుల విజ్ఞప్తి
