- ముదిగుబ్బలో రైతులకు వేరుశనగ విత్తన కాయలు పంపిణీ
- ఎఫ్‌పీఓ ఆధ్వర్యంలో సమ్మర్ పంటల ప్రోత్సాహం
ముదిగుబ్బ, ఏప్రిల్ 30: రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ముదిగుబ్బ మండలంలో అతియా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌పీఓ) ఆధ్వర్యంలో సమ్మర్ పంటల సాగుకు ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎఫ్‌పీఓలో సభ్యత్వం పొందిన రైతులకు కొత్త రకం వేరుశనగ విత్తనాలు (TCGS-1694)ను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి మండల క్లస్టర్ ఇంచార్జి తుమ్మల మనోహర్, మండల వ్యవసాయ అధికారి రవీంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా తుమ్మల మనోహర్ మాట్లాడుతూ వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను ప్రోత్సహించడం, రైతుల దిగుబడులు పెంచడం, అలాగే మార్కెట్‌లో సరైన ధర లభించేలా చేయడం ఎఫ్‌పీఓ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సంస్థ ద్వారా గుర్తింపు పొందిన రైతులకు గరిష్టంగా మూడు బస్తాల వరకు విత్తన కాయలను అందిస్తున్నట్లు చెప్పారు.
ఎఫ్‌పీఓ నిర్వాహకులు సంస్థ సీఈవో వెంకటేష్ నాయక్ మాట్లాడుతూ, సంస్థ ద్వారా అందించిన విత్తనాలతో పండించిన పంటను తిరిగి మార్కెట్ ధరకు కొనుగోలు చేసే ‘బైబ్యాక్’ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విధానం రైతులకు ధరల మార్పుల వల్ల కలిగే నష్టాలను తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. రైతులు నాణ్యమైన విత్తనాలతో పంటలను సాగు చేసి మంచి లాభాలు పొందాలని ఆకాంక్షించారు.
ఎఫ్‌పీఓ సభ్యత్వం పొందేందుకు రైతులు రూ.2 వేల చెల్లించి ముందస్తుగా నమోదు చేసుకోవచ్చని, సభ్యత్వం పొందిన వారికి రాబోయే పంటకాలాల్లో కూడా ఇలాంటి సబ్సిడీ పథకాలు, ఉచిత విత్తనాలు, సాంకేతిక మార్గదర్శకాలు అందించనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో అతియా ఎఫ్‌పీఓ సీఈఓ వెంకటేష్ నాయక్, సీసీఓ బాలకృష్ణారెడ్డి, ఎంసీఓ విజయ్‌కుమార్, త్రివేణి, సానివారిపల్లి క్లస్టర్ వీఏచ్ఏ పవన్, మండల వ్యవసాయ సిబ్బంది, ఎన్డీఏ కుటుంబ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
