Latest Posts

పాక్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో ఆడేందుకు టీమిండియా విముఖత

పాకిస్థాన్‌లో వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్ వివాదం ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. పాక్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో ఆడేందుకు టీమిండియా విముఖత చూపిస్తోంది. మరోపక్క దాయాది దేశం కూడా భారత్ తమ దేశంలో వచ్చి ఆడకుంటే.. తాము కూడా ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్‌నకు దూరంగా ఉంటామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) ఛైర్మన్ రమీజ్ రజా పదే పదే తేల్చిచెబుతున్నారు. భారత్ కూడా ఆసియా కప్‌ను న్యూట్రల్ వెన్యూలో జరిపించేందుకు పావులు కదుపుతుంది. దీంతో ఆసియా కప్‌ ఆతిథ్యం పాక్ నుంచి మరోక చోటుకు మారుస్తారనే వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా ఈ విషంయపై పీసీబీ చైర్మన్ రమీజ్ రజా స్పందించారు. “మాకు ఆతిథ్య హక్కులు ఇవ్వకపోతే.. ఇవ్వమని మేము కోరుకోవడం లేదు. ఆ హక్కులను మాకు మేము పారదర్శకంగా తెచ్చుకున్నాం. భారత్ రాకపోతే అది వారి ఇష్టం. అందుకోసం పాక్ నుంచి వేదికను మరోక చోటుకు మారిస్తే.. ఆసియా కప్ నుంచి మేమే వైదొలుగుతాం” అంటూ రమీజ్ రజా స్పష్టం చేశారు. ఇప్పటికే టీమిండియా ఆసియా కప్ కోసం పాక్ రాకపోతే వరల్డ్ కప్‌లో తాము ఆడమని ప్రకటించారు రమీజ్ రజా.

“ఈ అంశంలో మా నిర్ణయం మారదు. వాళ్లు(భారత జట్టు) ఆసియా కప్ కోసం వచ్చి ఆడితేనే.. అక్కడ జరగనున్న వరల్డ్ కప్‌లో మేము ఆడతాం. ఒకవేళ రాకుంటే.. పాకిస్థాన్ లేకుండా 2023 ప్రపంచకప్ జరుగుతుంది. మేము చూస్తాం పాక్ లేకుండా ఎవరెవరు ఆడతారో. ఈ విషయంలో మేము కూడా దూకుడుగానే వ్యవహరిస్తాం. మా జట్టు గత రెండేళ్లుగా మంచి ప్రదర్శన చేస్తోంది. క్రికెట్ మార్కెట్ అత్యధిక వ్యాపారం చేస్తోన్న జట్టును ఏడాది వ్యవధిలో రెండుసార్లు ఓడించాం.” అని అన్నారు. పాకిస్థాన్ వచ్చే ఏడాది ఆసియా కప్‌ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీలో పాల్గొనేందుకు టీమిండియా విముఖత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. పాక్ చివరగా 2009 ఆసియా కప్‌ను హోస్ట్ చేసింది. అప్పుడు లాహోర్‌లోని గడాఫీ స్టేడియానికి సమీపంలో శ్రీలంక ఆటగాళ్లపై ఉగ్రదాడి జరగడంతో అప్పటి నుంచి ఆ దేశంలో ఇతర జట్లు పర్యటించడానికి వెనుకాడాయి. చాలా కాలం తర్వాత 2015లో జింబాబ్వే జట్టు మూడు వన్డేల సిరీస్‌ కోసం పర్యటించింది. అనంతరం 2017లో శ్రీలంక జట్టు వన్డే సిరీస్ ఆడింది. ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియా కూడా పర్యటించింది.

Editor