అంతర్జాతీయ క్రికెట్‌లో బంతికి ఉమ్మి (సలైవా) వాడకంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసే ప్రసక్తే లేదని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తేల్చిచెప్పింది. వెల్లింగ్‌టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసిన తర్వాత టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సలైవా నిషేధం అంశాన్ని ప్రస్తావిస్తూ, బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై కూకబుర్రా బంతి త్వరగా మెత్తబడుతోందని, కోవిడ్ కాలం ముగిసి ఏళ్లు గడుస్తున్నా బంతిపై ఉమ్మిని ఎందుకు అనుమతించడం లేదో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశాడు. అయితే, ఆటగాళ్లు, మ్యాచ్ అధికారుల ఆరోగ్య భద్రత మరియు క్రీడాస్ఫూర్తి దృష్ట్యా ఈ విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని ఐసీసీ స్పష్టం చేసింది.
2020లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో తాత్కాలికంగా ప్రవేశపెట్టి ఆ తర్వాత శాశ్వత నిబంధనగా మార్చిన ఈ నిషేధం మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నిబంధనలకు అనుగుణంగానే ఉందని ఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. ఉమ్మి వాడకాన్ని పర్యవేక్షించడం, నియంత్రించడం కష్టమని, కొందరు ఆటగాళ్లు స్వీట్లు, చూయింగ్ గమ్, మింట్స్ వంటి పదార్థాలతో కలిపి ఉమ్మిని బంతికి పూసి బంతి స్వరూపాన్ని అక్రమంగా మార్చే ప్రమాదం ఉందని ఐసీసీ అభిప్రాయపడుతోంది.
ఆసక్తికరంగా ఐపీఎల్ 2025 సీజన్ నుంచి దేశీయ టోర్నీగా సలైవా నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ, అంతర్జాతీయ క్రికెట్‌పై దాని ప్రభావం ఉండదని ఐసీసీ తేల్చిచెప్పింది. ఇటీవల బాలిలో జరిగిన ఐసీసీ సమావేశాల్లో కూడా ఈ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదని, భవిష్యత్తులో నిబంధనల్లో మార్పు తీసుకురావాలంటే ఏదైనా సభ్య దేశం సంబంధిత కమిటీ ద్వారా అధికారిక ప్రతిపాదన చేసి ఐసీసీ బోర్డు ఆమోదం పొందాల్సి ఉంటుందని, ప్రస్తుతానికి నిషేధం యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది.z
