Latest Posts

ఉదయం అల్పాహారంగా టీ, బిస్కెట్లు మాత్రమే తీసుకుంటున్నారా?.. నెల రోజుల తర్వాత శరీరంలో జరిగే మార్పులివే!

చాలామంది రోజు ఉదయం ఒక కప్పు వేడి టీతో పాటు రెండు బిస్కెట్లు తిని అల్పాహారం పూర్తయినట్లు భావిస్తారు. కానీ ప్రొటీన్లు, ఫైబర్ తక్కువగా ఉండి.. మైదా, చక్కెర, కొవ్వులు అధికంగా ఉండే ఈ అలవాటు శరీరానికి అవసరమైన పోషకాలను అందించదు. డైటీషియన్ కనికా మల్హోత్రా ప్రకారం, చక్కెర కలిపిన టీ, మైదా బిస్కెట్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయులను వేగంగా పెంచి, దీర్ఘకాలంలో ఇన్సులిన్ నిరోధకత ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది.

నెల రోజుల పాటు ఇదే అలవాటు కొనసాగితే ప్రొటీన్ల కొరత వల్ల త్వరగా ఆకలి వేయడం, ఫైబర్ తక్కువగా ఉండటంతో మలబద్ధకం, అలాగే టీలోని టానిన్ల వల్ల ఐరన్ శోషణ తగ్గడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అదనపు కేలరీలతో బరువు పెరగడంతో పాటు ఉదయం వేళ అలసట, ఏకాగ్రత తగ్గడం, చిరాకు వంటి లక్షణాలు కూడా కనిపించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అయితే టీ తాగే అలవాటును పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు; చక్కెర తక్కువగా లేదా లేకుండా తీసుకుంటూ బిస్కెట్లకు బదులుగా పోషక విలువలున్న ఆహారాన్ని ఎంచుకోవడం మంచిది. బాదం పప్పులు, మఖానా, ఉడికించిన గుడ్డు, బేసన్ చిల్లా, అరటిపండు లేదా జామపండు వంటి ప్రత్యామ్నాయాలను చేర్చుకోవడం ద్వారా రోజువారీ పోషక అవసరాలను సులభంగా తీర్చుకోవచ్చని సూచిస్తున్నారు.

Editor