తనపై వస్తున్న విమర్శలు, ఆరోపణలపై అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ) వీసీ సజ్జనార్ తీవ్రస్థాయిలో స్పందించారు. సమాజంలో తమ ఉనికిని చాటుకోవడం కోసమే కొందరు వ్యక్తులు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎటువంటి ఆధారాలు, వాస్తవాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు.
ఆధారాలు లేకుండా వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారు భవిష్యత్తులో కచ్చితంగా చట్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని సజ్జనార్ హెచ్చరించారు. తప్పుడు ప్రచారాలు చేసే వారికి కాలమే తగిన సమాధానం చెబుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
తన సుదీర్ఘ వృత్తి జీవితం గురించి ప్రస్తావిస్తూ, గత 26 ఏళ్ల సర్వీసులో తాను సుమారు 20 సార్లు బదిలీ అయ్యానని సజ్జనార్ వెల్లడించారు. బదిలీలు ప్రభుత్వ ఉద్యోగంలో సహజమైన భాగమేనని పేర్కొన్న ఆయన, ప్రభుత్వం ఏ బాధ్యత అప్పగించినా, ఏ పోస్టింగ్ ఇచ్చినా తన వంతు కృషిని పూర్తి నిబద్ధతతో కొనసాగిస్తానని మరోసారి స్పష్టం చేశారు.
