తెలంగాణలో జాతీయ స్థాయి క్రీడా సంబరానికి రంగం సిద్ధమవుతోంది. ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ఎనిమిదో ఎడిషన్‌కు రాష్ట్రం తొలిసారిగా ఆతిథ్యం ఇవ్వనుంది. డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు మొత్తం 12 రోజుల పాటు ఈ పోటీలు జరగనుండగా, రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న యువ క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకునేందుకు ఈ వేదిక వేదిక కానుంది.
న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అధికారిక లోగో, మస్కట్‌ను ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి, ప్రకృతి అందాలకు ప్రతీకగా ఈ మస్కట్‌కు ‘నీలమణి’ అని నామకరణం చేశారు. ఈ పోటీల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 8 వేల మంది అథ్లెట్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది పాల్గొననున్నారు. ఈసారి మొత్తం 29 క్రీడా విభాగాలు (27 అధికారిక పోటీ క్రీడలు, 2 ప్రదర్శన క్రీడలు) నిర్వహించనున్నారు.
ఈ క్రీడలను కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని ఆరు ప్రధాన నగరాల్లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు ఖమ్మంలో ఆర్చరీ, హనుమకొండలో అథ్లెటిక్స్, కరీంనగర్లో జూడో, నిజామాబాద్‌లో టేబుల్ టెన్నిస్, మహబూబ్‌నగర్‌లో కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఈ క్రీడా మహాత్సవం ద్వారా తెలంగాణలో క్రీడా మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడటంతో పాటు పర్యాటక, ఆతిథ్య రంగాలకు కూడా పెద్దఎత్తున ప్రయోజనం చేకూరనుంది.
