Latest Posts

బంగాళాఖాతంలో తీవ్ర రూపం దాలుస్తున్న ‘అక్వాన్’ తుపాను.. నెల్లూరు తీరంలో అల్లకల్లోలంగా సముద్రం, 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ!

దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అక్వాన్’ తుపాను మరింత బలపడుతోంది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదిలిన ఈ తుపాను, సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించారు. ప్రస్తుతానికి ఇది చెన్నైకి 610 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 660 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ముంచుకొస్తున్న తుపాను ముప్పును దృష్టిలో ఉంచుకుని రైతులు వ్యవసాయ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరించారు.

తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లా తీరంలో సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారింది. గంటగంటకూ అలల ఉద్ధృతి పెరుగుతుండటంతో పలుచోట్ల సముద్రపు నీరు 50 మీటర్ల నుంచి 200 మీటర్ల వరకు ముందుకు చొచ్చుకువచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సముద్రంలోకి చేపలవేటను తక్షణమే నిలిపివేశారు. జువ్వలదిన్నె హార్బర్‌లో 80కి పైగా మరబోట్లను సురక్షితంగా లంగరు వేశారు. తీర ప్రాంతంలో కృష్ణపట్నం పోర్టులో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయగా, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికార యంత్రాంగం పటిష్ఠ రక్షణ చర్యలు చేపట్టింది.

ఈ తుపాను కారణంగా కురిసే వర్షాలతో సోమశిల, కండలేరు జలాశయాలు నిండితే తమ తాగు, సాగునీటి కష్టాలు తీరుతాయని స్థానిక ప్రజలు ఆశిస్తున్నారు. ఏపీ, దక్షిణ ఒరిస్సా తీర ప్రాంతాల్లో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

Posted Under AP
Editor