రాయదుర్గంలో మున్సిపల్ పోలింగ్ జోరు
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఉదయం ఏడు గంటలకు మున్సిపల్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి.
ఉదయం 9 గంటలకు 18.88 శాతం పోలింగ్ నమోదు కాగా, 11.35 గంటలకు 38.79 శాతం పోలింగ్ నమోదయింది.
రాయదుర్గం పట్టణంలో మొత్తం 53,696 ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే 20826 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
40 మంది కౌన్సిలర్లు, ఒక మున్సిపల్ చైర్మన్ ఎన్నికల కోసం ప్రభుత్వం 80 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది.
పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వాతావరణం మేఘావృతం కావడంతో చల్లని గాలుల్లో మంచి వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి.
రాయదుర్గం పట్టణంలోని శాంతినగర్ లో గల కూన నాగప్ప సుంకమ్మ మున్సిపల్ పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు కుటుంబ సమేతంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రాయదుర్గం తెదేపా చైర్మన్ అభ్యర్థి టంకశాల హనుమంతు, వైకాపా చైర్మన్ అభ్యర్థి పోరాల్ల శివకుమార్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
