టాలెంటెడ్ నటి రెజీనా కసాండ్రా తన సినీ ప్రస్థానంలోనే తొలిసారిగా ఒక పూర్తిస్థాయి కమర్షియల్ విలన్‌గా వెండితెరపై అలరించేందుకు సిద్ధమయ్యారు. దర్శకుడు సుందర్ సి రూపొందించిన ప్రతిష్టాత్మక డివోషనల్ కామెడీ చిత్రం ‘మూకుత్తి అమ్మన్ 2’లో తాను ‘భైరవి’ అనే అత్యంత శక్తివంతమైన నెగెటివ్ పాత్రను పోషించినట్లు ఆమె వెల్లడించారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో పాల్గొన్న రెజీనా మాట్లాడుతూ.. ఈ క్రూరమైన విలన్ పాత్ర కోసం తాను ప్రాణం పెట్టి నటించానని, తన సినీ కెరీర్లోనే ఇదొక సరికొత్త అనుభవమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు సుందర్ సి ప్రతిభపై రెజీనా ప్రశంసల జల్లు కురిపించారు. గత 30 సంవత్సరాలుగా కోలీవుడ్‌లోనే కొనసాగుతూ, తమిళ సినిమాను పాన్-ఇండియా స్థాయికి తీసుకెళ్లిన అరుదైన దర్శకుడు సుందర్ సి అని ఆమె కొనియాడారు. అలాంటి అనుభవజ్ఞుడైన దర్శకుడి ప్రాజెక్ట్‌లో ఇంతటి కీలకమైన పాత్ర దక్కడం గొప్ప అవకాశమని చెప్పారు. ముఖ్యంగా లేడీ సూపర్ స్టార్ నయనతారతో కలిసి తాను చేసిన యాక్షన్, ఫైట్ సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులకు తప్పకుండా గూస్బంప్స్ తెప్పిస్తాయని రెజీనా ధీమా వ్యక్తం చేశారు.
2020లో సంచలన విజయం సాధించిన ‘మూకుత్తి అమ్మన్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ భారీ చిత్రాన్ని వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మాత ఇషారి కె. గణేశ్ నిర్మించారు. నయనతారతో పాటు ఖుష్బూ, స్నేహ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఇప్పటికే నిర్మాణానంతర పనులను పూర్తి చేసుకుని నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. మహిళా ప్రాధాన్యమున్న భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించడం చిత్ర పరిశ్రమలోని నటీమణులందరికీ కొత్త ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని, కంటెంట్‌ను నమ్మి భారీగా పెట్టుబడులు పెట్టే నిర్మాతలకు ప్రేక్షకులు ఎల్లప్పుడూ అండగా నిలవాలని రెజీనా పిలుపునిచ్చారు.
