అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రంలో గల ప్రముఖ అణు పరిశోధనా కేంద్రం ‘సవన్నా రివర్ నేషనల్ లేబొరేటరీ’ ప్రాంగణంలో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. రీసెర్చ్ సెంటర్‌లోని ఓ భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన అధికారులు సాయంత్రం 5:39 గంటలకు సైట్ వ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని (Nuclear Emergency) ప్రకటించారు. అత్యంత ప్రమాదకరమైన రేడియోధార్మిక పదార్థాలు గాలిలోకి వ్యాపించే అవకాశం ఉందన్న ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా క్యాంపస్‌కు వెళ్లే ప్రధాన రహదారులను మూసివేయడమే కాకుండా, పరిసర ప్రాంతాల్లో రైలు, నదీ, విమాన రాకపోకలపై అధికారులు తక్షణమే తాత్కాలిక ఆంక్షలు విధించారు.
సమాచారం అందుకున్న అత్యవసర సహాయక బృందాలు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వేగంగా చేరుకుని తీవ్రంగా శ్రమించి సుమారు రెండు గంటల్లోనే మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం ఆ ప్రాంతంలో రేడియోధార్మిక కాలుష్యం వ్యాపించిందా అనే దానిపై నిపుణులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రమాదం జరిగిన భవనం వెలుపల ఎలాంటి అణు లేదా రేడియోధార్మిక కాలుష్య ఆనవాళ్లు లేవని అధికారులు అధికారికంగా స్పష్టం చేయడంతో అక్కడి ఉద్యోగులు, స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పరిస్థితి అదుపులోకి రావడంతో రాత్రి 9:45 గంటల ప్రాంతంలో ఎమర్జెన్సీని ఎత్తివేసి, రవాణా ఆంక్షలను తొలగించి గురువారం యథావిధిగా విధులకు హాజరు కావచ్చని సిబ్బందికి సూచించారు.
అయితే అత్యంత సున్నితమైన అణు వ్యర్థాలు, రేడియోధార్మిక పదార్థాలు నిల్వ ఉండే ప్రాంతంలో మంటలు చెలరేగడంపై శాస్త్రవేత్తలు, భద్రతా నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యూనియన్ ఆఫ్ కన్సర్న్డ్ సైంటిస్ట్స్ విభాగం డైరెక్టర్ ఎడ్విన్ లైమన్ మాట్లాడుతూ.. సాధారణ మంటలకు, రేడియోధార్మిక జోన్లలో వచ్చే మంటలకు చాలా వ్యత్యాసం ఉంటుందని, ల్యాబ్ వెలుపల కాలుష్యం వ్యాపించకపోవడం పెద్ద ఊరటనిచ్చే విషయమైనప్పటికీ ఇలాంటి సమయాల్లో మరింత అప్రమత్తత అవసరమని హెచ్చరించారు. ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా? అసలు మంటలు ఎలా చెలరేగాయి? అనే ఖచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
