Latest Posts

‘అర్నబ్’ తుఫాన్ భయంతో ఎగబడ్డ జనం.. నిత్యావసరాలకు తీవ్ర కొరత: కూరగాయలు, గుడ్ల ధరలకు రెక్కలు!

ఆంధ్రప్రదేశ్‌పై ‘అర్నబ్’ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతుండటంతో తీర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈదురుగాలులు, కుండపోత వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోవడమే కాకుండా విద్యుత్ సరఫరా నిలిచిపోతుందనే ఆందోళనతో జనాలు ముందుజాగ్రత్త చర్యలకు ఉపక్రమించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో రాబోయే నాలుగు నుంచి ఐదు రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు, పాలు, కూరగాయలను ఒక్కసారిగా కొనుగోలు చేసి నిల్వ చేసుకునేందుకు ప్రజలు పోటీ పడ్డారు. దీంతో రైతు బజార్లు, కిరాణా దుకాణాలు, పాల బూత్‌ల వద్ద మునుపెన్నడూ లేనంత రద్దీ కనిపించింది. ఆహార పదార్థాలే కాకుండా విద్యుత్ కోతల భయంతో కొవ్వొత్తులు, పవర్ బ్యాంకులు, ఎమర్జెన్సీ రీఛార్జబుల్ లైట్లకు కూడా డిమాండ్ భారీగా పెరిగింది.
ప్రజల నుంచి ఒక్కసారిగా డిమాండ్ అనూహ్యంగా పెరగడంతో మార్కెట్లో నిత్యావసరాలు, అత్యవసర వస్తువులకు తీవ్ర కొరత ఏర్పడి, ఆ ప్రభావం ధరలపై స్పష్టంగా కనిపించింది. సాధారణంగా ఒకట్రెండు రోజులకు సరిపడా కూరగాయలు కొనేవారు సైతం ఎక్కువ రోజులకు సరిపడా సరుకులను ఎగబడి కొనుగోలు చేయడంతో వ్యాపారులకు విక్రయాలు జోరుగా సాగాయి. అయితే ఇదే అదనుగా పలు ప్రాంతాల్లో ధరలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా కోడిగుడ్ల ధర ఒక్కసారిగా పెరిగి, ఒక్కో గుడ్డుపై రూ.2 వరకు అధికమై రూ.8.30కి చేరింది. కూరగాయల ధరలు కూడా గణనీయంగా పెరిగి సామాన్యుడి జేబుకు తీవ్ర చిల్లు పెట్టాయి. దీనికితోడు తాగునీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు ప్రజలు ఆర్వో (RO) ప్లాంట్ల వద్ద క్యూ కట్టి తాగునీటి క్యాన్లను పెద్ద సంఖ్యలో నిల్వ చేసుకుంటున్నారు.
గతంలో విశాఖపట్నాన్ని అతలాకుతలం చేసిన హుదూద్ తుఫాన్ సమయంలో పాల ప్యాకెట్లు, తాగునీరు, నిత్యావసరాల కోసం ప్రజలు పడిన అగచాట్లను గుర్తుచేసుకుంటూ ఈసారి మరింత ముందుగానే అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. తీరానికి తుఫాన్ ముప్పు పొంచి ఉందన్న వార్త రాగానే జనాలు తమ ఇళ్లలో నిల్వలు పెంచుకోవడానికి మొగ్గు చూపారు. విపత్తు వేళ అవసరాలు తీరక ఇబ్బంది పడకూడదన్న ప్రజల ఆరాటం ఓవైపు కనిపిస్తుండగా, కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించే వ్యాపారుల తీరుపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిత్యావసరాల ధరలను నియంత్రించి, ప్రజలకు సరుకులు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Posted Under AP
Editor