రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో డీజిల్ సరఫరా ఒప్పందం కుదుర్చుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో అధికంగా పెరిగిన చమురు ధరలను తగ్గించేందుకు రష్యా నుంచి గ్లోబల్ మార్కెట్లకు సుమారు 3 లక్షల టన్నులకు పైగా డీజిల్‌ను సరఫరా చేసేలా ట్రంప్-పుతిన్ మధ్య డీల్ కుదిరినట్లు ప్రకటించిన నేపథ్యంలో జెలెన్స్కీ తీవ్రంగా స్పందించారు. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ‘పియర్స్ మోర్గాన్ అన్సెన్సార్డ్’ టాక్ షో ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ నిర్ణయంతో అమెరికా చరిత్రలోనే తప్పుడు పక్షం వైపు నిలబడిందని ఘాటుగా ఆరోపించారు.
యుద్ధ సమయంలో తమను వదిలేసి ట్రంప్ రష్యా వైపు మొగ్గు చూపడం తీవ్ర బాధాకరమని జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా కనీసం తటస్థ వైఖరి పాటించినా బాగుండేదని, కానీ ఇలా ఆక్రమణదారుల పక్షాన నిలవడం ముమ్మాటికీ చారిత్రక తప్పిదమని మండిపడ్డారు. వైట్‌హౌస్ సలహాదారులు ట్రంప్‌ను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టిన ఆయన, ఈ పరిణామంతో ఉక్రెయిన్ ఒక అత్యంత బలమైన భాగస్వామిని కోల్పోతోందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఇదే క్రమంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అక్టోబర్ 11న ట్రంప్ ప్రతిపాదించిన ‘ఇంధన కాల్పుల విరమణ’ ఒప్పందాన్ని కూడా జెలెన్స్కీ ప్రస్తావించారు. ఆ ప్రతిపాదనను గౌరవించి తాము రష్యా ఇంధన కేంద్రాలపై దాడులను తాత్కాలికంగా ఆపినప్పటికీ, రష్యా మాత్రం బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్ పవర్ గ్రిడ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తోందని ఆరోపించారు. రష్యా చేపట్టిన ఈ విధ్వంసకర దాడుల కారణంగా ప్రస్తుతం దేశంలో 6 లక్షల మందికి పైగా అమాయక ప్రజలు అంధకారంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
