- రూ.78 కోట్లతో సమగ్ర మంచినీటి పథకం పనులు
- అమృత్ 2.0 పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు
రాయదుర్గం: పట్టణ ప్రజలకు భవిష్యత్తులోనూ మెరుగైన, నిరంతర రక్షిత మంచినీటి సరఫరా అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అధికారులకు సూచించారు. రాయదుర్గం పట్టణంలోని బీటీపీ లేఅవుట్లో అమృత్ 2.0 పథకం కింద జరుగుతున్న రక్షిత మంచినీటి పైప్లైన్ పనులను ఆయన పరిశీలించి, పనుల పురోగతిని సమీక్షించారు.
రాయదుర్గం ప్రజల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని సుమారు రూ.78 కోట్ల వ్యయంతో చేపట్టిన సమగ్ర మంచినీటి పథకం పట్టణ అభివృద్ధికి కీలకంగా నిలవనుంది. పెరుగుతున్న జనాభా, భవిష్యత్తులో తలెత్తే నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేలా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పైప్లైన్ పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని, నిధులు సద్వినియోగం అయ్యేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.
రాయదుర్గం పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడంతో పాటు ప్రజలకు మౌలిక వసతులు మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఈ పథకం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
