అభిజీత్ దీప్కే అరెస్ట్.. కొన్ని గంటల్లోనే నానమ్మ మృతి

కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఢిల్లీలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్న కొద్ది గంటల్లోనే మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో ఆయన నానమ్మ సావిత్రీబాయి దీప్కే (85) కన్నుమూశారు. ఈ విషాద వార్తతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. నానమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు దీప్కే తల్లిదండ్రులు హింగోలికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.

ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకున్న అభిజీత్ దీప్కే, ఆయన సహచరులను విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

అభిజీత్ దీప్కే ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సందర్భంగా రికార్డయినట్లు చెబుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అందులో పోలీసులు విమానంలోకి వచ్చి ఆయన వద్దకు వెళ్లడం కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు తనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని దీప్కే చెప్పినట్లు వీడియోలో వినిపిస్తోంది. ఆయనతో పాటు కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Editor