Latest Posts

“ఏపీకి 23 ఐఐటీల అత్యాధునిక టెక్నాలజీ”: చంద్రబాబు సమక్షంలో చారిత్రక డిక్లరేషన్.. అమరావతిని క్వాంటం వ్యాలీగా మార్చేలా రూ. 500 కోట్లతో వెంచర్ ఫండ్!

ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి, పారిశ్రామిక నవకల్పనలకు సరికొత్త ఊతమిచ్చేలా దేశంలోని ప్రతిష్టాత్మక 23 ఐఐటీలు (IITs) రాష్ట్ర ప్రభుత్వంతో జట్టుకట్టాయి. విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన ‘పాన్ ఐఐటీ ఏపీ 2026’ సదస్సు ముగింపు వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒక చారిత్రక ఉమ్మడి డిక్లరేషన్‌ను విడుదల చేశాయి. రాష్ట్రానికి అవసరమైన అత్యాధునిక పరిశోధనలు, డీప్‌టెక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని నేరుగా బదిలీ చేసేందుకు ఐఐటీలు పూర్తి స్థాయిలో అంగీకారం తెలిపాయి. రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి నాలెడ్జ్ మరియు డీప్‌టెక్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 5 లక్షల మంది ఐఐటీయన్లను అనుసంధానిస్తూ అమరావతి కేంద్రంగా ‘పాన్ ఐఐటీ వరల్డ్ కౌన్సిల్’ ఏర్పాటు కానుంది.

ఈ సదస్సు వేదికగా డీప్‌టెక్ స్టార్టప్‌లు, పరిశోధనలను ప్రోత్సహించేందుకు రూ. 500 కోట్ల భారీ నిధులతో ‘పాన్ ఐఐటీ అమరావతి వెంచర్ ఫండ్’ను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ 100 మంది ఐఐటీ నిపుణులతో గ్లోబల్ మెంటర్ల నెట్‌వర్క్‌ను రూపొందించి ఏపీ యువతకు, స్టార్టప్‌లకు మార్గనిర్దేశం చేయనున్నారు. అంతేకాకుండా, క్యూబిట్ ఫోర్స్ మరియు చండీగఢ్ యూనివర్సిటీ సహకారంతో రూపొందించిన ‘క్యూ-శివ’ పేరిట ఐదు మినీ టెస్టింగ్ క్వాంటం కంప్యూటర్లతో పాటు 4 కెల్విన్ ప్రాసెసర్‌ను సీఎం ఆవిష్కరించారు. ఈ అత్యాధునిక కంప్యూటర్ల తయారీకి అవసరమైన కాంపోనెంట్లు మచిలీపట్నంలోనే లభిస్తుండటం ద్వారా ‘మేడ్ ఇన్ అమరావతి’ బ్రాండ్ విశ్వవ్యాప్తం కానుందని స్పష్టం చేశారు.

ఇప్పటివరకు ప్రపంచం సిలికాన్ వ్యాలీ గురించి మాట్లాడుకుందని, ఇకపై అమరావతి క్వాంటం వ్యాలీ వైపు చూస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అమరావతిలో ఐబీఎం, టీసీఎస్, ఎల్‌అండ్‌టీ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో క్వాంటం కంప్యూటర్ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. 2030 నాటికి రాష్ట్రంలో కనీసం 50 డీప్‌టెక్ స్టార్టప్‌లను విజయవంతంగా ఇంక్యుబేట్ చేయడంతో పాటు సెమీకండక్టర్లు, ఏఐ, స్పేస్-డిఫెన్స్ వంటి అత్యాధునిక రంగాల్లోకి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక డీప్‌టెక్ పాలసీ ప్యాకేజీని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

Posted Under AP
Editor