వారానికి ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగ సంఘాలు సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. గతంలో ఐదు రోజుల పని విధానానికి ప్రభుత్వం అంగీకరించిందని, ఆ హామీని అమలు చేయాలని సంఘాలు కోరుతున్నాయి.
అయితే బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రకటనలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖండించింది. వారానికి ఐదు రోజుల పని దినాలపై ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఈ అంశంపై గతంలో అంగీకారం కుదిరిందన్న వాదనలను తోసిపుచ్చింది.
వేతన సవరణ చర్చల సమయంలోనూ ఐదు రోజుల పని విధానంపై ఎలాంటి చర్చ జరగలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో బ్యాంకు ఉద్యోగ సంఘాల సమ్మె పిలుపు, కేంద్ర ప్రభుత్వ స్పందనపై చర్చ జరుగుతోంది.
