విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) కార్యాలయం వద్ద స్పోర్ట్స్ కోటా ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడటంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి, రాష్ట్రానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిన క్రీడాకారులను వేధించడం అత్యంత హేయమైన చర్య అని ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు. గురువులను దైవంగా భావించే సంస్కృతి మనదని, అలాంటి ఉపాధ్యాయులపై రాజకీయ దురుద్దేశంతో భౌతిక దాడులకు దిగడం సమాజానికి గొడ్డలిపెట్టు అని దుయ్యబట్టారు.
నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తుగా చేసిన నిరాధార ఆరోపణలే ఈ దాడులకు పురిగొల్పాయని లోకేశ్ విమర్శించారు. క్రీడా ప్రతిభతో అర్హత సాధించి ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు తమ సమస్యలను అధికారులకు విన్నవించుకునేందుకు శాంతియుతంగా శాప్ కార్యాలయానికి వెళ్లగా, వైసీపీ నేతలు పథకం ప్రకారం వారిపైకి రౌడీ షీటర్లు, బ్లేడ్, గంజాయి బ్యాచ్లను ఉసిగొల్పారని ఆరోపించారు. రాడ్లు, కర్రలతో టీచర్లపై విచక్షణారహితంగా దాడి చేయించడం క్షమించరాని ఘోరమని ధ్వజమెత్తారు.
ఉపాధ్యాయులపై దాడికి పాల్పడిన వారిలో ఎంతటి వారున్నా ఉపేక్షించే ప్రసక్తే లేదని, ప్రతి ఒక్కరిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థను, పాఠశాలలను, ఉపాధ్యాయులను లక్ష్యంగా చేసుకుని వైఎస్సార్సీపీ చేస్తోన్న దిగజారుడు రాజకీయాలను తక్షణమే మానుకోవాలని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం అర్హులైన ప్రతి ఉపాధ్యాయుడికి పూర్తి రక్షణ కల్పిస్తుందని, నిందితులను పోలీసులు వెంటనే గుర్తించి కటకటాల్లోకి నెడతారని వెల్లడించారు.
