Latest Posts

పిఠాపురంలో మైసమ్మ చెరువును ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్: గ్రామీణ ఆహ్లాదమే లక్ష్యంగా మోడల్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురం పర్యటనలో భాగంగా గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదాన్ని పెంపొందించే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఫకృద్ధీన్ పాలెం గ్రామంలో రూ.73 లక్షల వ్యయంతో సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసిన ‘మైసమ్మ చెరువు’తో పాటు వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్కు, ఓపెన్ ఎయిర్ జిమ్‌ను సోమవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. గ్రామీణ చెరువులను కేవలం సాగు, తాగునీటి వనరులుగానే కాకుండా ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే సామాజిక కేంద్రాలుగా మార్చాలనే సంకల్పంతో ఈ చెరువును ఒక మోడల్ ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దినట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రారంభోత్సవానికి ముందు పవన్ కల్యాణ్ చెరువు గట్టుపై వెలసిన శ్రీ మైసమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన పార్కును వారితో కలిసే ప్రారంభించి, పిల్లలకు స్వయంగా చాక్లెట్లు, తినుబండారాలు పంచిపెట్టారు. అనంతరం నియోజకవర్గవ్యాప్తంగా రూ.6 కోట్ల వ్యయంతో పునరుద్ధరించిన మరో 11 చెరువుల శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. కాకినాడ జిల్లా పరిధిలో తీర్చిదిద్దిన 14 చెరువుల ఫొటో గ్యాలరీని పరిశీలించిన డిప్యూటీ సీఎం, ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (PMKSY) సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా రూ.50 కోట్లతో చేపట్టిన 105 చెరువుల సుందరీకరణ పనులను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు.

అనంతరం ఫకృద్ధీన్ పాలెం గ్రామంలో కలియతిరుగుతూ స్థానిక ప్రజల నుంచి సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు. గ్రామ సచివాలయాన్ని, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికులను ఆప్యాయంగా పలకరించి వారితో కలిసి గ్రూప్ ఫోటోలు దిగారు. గ్రామాల రూపురేఖలు మార్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు.

Posted Under AP
Editor