Latest Posts

సాక్షాత్తు సీఎం సొంత ఊరిలోనే ఈ దుస్థితా?: కరెంట్ కోతలపై రేవంత్ సర్కార్‌ను నిలదీసిన కేటీఆర్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యానికి గురిచేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో వ్యవసాయానికి అందించిన 24 గంటల నిరంతర, నాణ్యమైన ఉచిత విద్యుత్ స్థానంలో.. మళ్లీ పాతకాలపు కరెంటు కోతలు పునరావృతమవుతున్నాయని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లికి చెందిన రైతులు విద్యుత్ కోతలు, లో-వోల్టేజీ సమస్యలతో కన్నీరుమున్నీరవుతున్న వీడియోను ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.

“కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదు.. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రానికి వచ్చిన అసలైన మార్పు ఇదేనా?” అంటూ కేటీఆర్ తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సాక్షాత్తు రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కాకుండా, ఆయన సొంత ఊరైన కొండారెడ్డిపల్లిలోనే రైతులు విద్యుత్ కోసం అల్లాడాల్సి రావడం ప్రభుత్వ అసమర్థతకు పరాకాష్ట అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఊరిలోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇక రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ధ్వజమెత్తారు.

సమయానికి విద్యుత్ సరఫరా లేకపోవడం, సరైన వోల్టేజ్ రాకపోవడం వల్ల పొలాలకు సాగునీరు అందక చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని, మరోవైపు లో-వోల్టేజీతో వ్యవసాయ బోర్ల మోటార్లు కాలిపోయి రైతులు తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ తెచ్చిన రైతు సంక్షేమ పాలనను కాంగ్రెస్ తుంగలో తొక్కిందని దుయ్యబట్టిన ఆయన, ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతాంగానికి నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.

Editor