కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ నిర్వహణలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని, వాటిని తాము ఆధారాలతో సహా నిలదీస్తుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తీవ్రంగా బీపీ పెరుగుతోందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. విద్యాశాఖలో కష్టపడి మెరిట్ సాధించిన నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని ఆయన ఆరోపించారు. డీఎస్సీ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన నవీన్ అనే అర్హుడైన అభ్యర్థికి ఉద్యోగం ఎందుకు నిరాకరించారో ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా నిబంధనలను అడ్డగోలుగా మార్చేసి, కనీసం పరీక్ష కూడా రాయని 372 మందికి అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు కట్టబెట్టారని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. పాత జీవోలను రద్దు చేసి కొత్త నిబంధనలు తీసుకురావడం వెనుక భారీ అవినీతి దాగి ఉందని, నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు సమర్పించిన అనర్హులకు పోస్టులను కట్టబెట్టారని ధ్వజమెత్తారు. రేయింబవళ్లు శ్రమించి పరీక్షలు రాసిన వేలాది మంది అర్హులైన నిరుద్యోగుల జీవితాలతో కూటమి సర్కార్ చెలగాటమాడుతోందని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
అర్హత లేని వారికి నియామక పత్రాలు అందజేస్తూ అసలైన మెరిట్ అభ్యర్థుల భవిష్యత్తును నాశనం చేయడం క్షమించరాని నేరమని జగన్ పేర్కొన్నారు. డీఎస్సీ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై, స్పోర్ట్స్ కోటా అక్రమాలపై కూటమి ప్రభుత్వం తక్షణమే పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల గొంతుకై వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుందని, ఈ అక్రమాలపై ప్రభుత్వం ప్రజలకు, అభ్యర్థులకు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు.
