ప్రతిపక్ష బీఆర్ఎస్ పన్నుతున్న కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని, ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం అధ్యక్షతన నిర్వహించిన కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశంలో ఎమ్మెల్యేలకు కీలక మార్గదర్శనం చేశారు. ప్రజాపాలన 1,000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించడానికే శాసనసభ సమావేశాలు నిర్వహిస్తుంటే, బీఆర్ఎస్ పార్టీ సభా కార్యకలాపాలను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని ఆయన మండిపడ్డారు.
అధికారం కోల్పోయినా బీఆర్ఎస్ నేతల్లో అహంకారం ఏమాత్రం తగ్గలేదని ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సభా ప్రాంగణంలో పోలీసులు, ప్రజాప్రతినిధులను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, మహిళా అధికారుల ముందే టీ-షర్టులు విప్పి నిరసన తెలపడం బీఆర్ఎస్ దిగజారుడు తనానికి నిదర్శనమని ఆరోపించారు. అత్యున్నత స్థానంలో ఉన్న శాసనసభాపతిపై అత్యంత అభ్యంతరకరమైన భాషను వాడుతూ సభా సంప్రదాయాలకు తూట్లు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను ప్రజలకు వివరించడంలో ముందున్న ప్రజాప్రతినిధులను సీఎం అభినందించారు. ప్రతిపక్షాల కుతంత్రాలకు దీటుగా బదులివ్వాలని, పార్టీ ఎమ్మెల్యేలందరూ సభకు తప్పనిసరిగా హాజరై చర్చల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజా సమస్యలపై గళమెత్తాలని ఆదేశించారు. సభలోనూ, వెలుపలా ప్రభుత్వ విజయాలను విస్తృతంగా చాటిచెప్పడం ద్వారా ప్రతిపక్షాల డ్రామాలను ఎండగట్టాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.
