రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)కు చెందిన ఎఫ్ఎంసీజీ సంస్థ రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) ఐస్‌క్రీమ్ విభాగంలోకి అధికారికంగా అడుగుపెట్టింది. ‘బాంబే క్రీమరీ’ పేరుతో కొత్త ఐస్‌క్రీమ్ బ్రాండ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. స్వచ్ఛమైన డెయిరీ పదార్థాలతో తయారు చేసిన ఈ ఐస్‌క్రీమ్‌ను ప్రీమియం నాణ్యతతో పాటు అందుబాటు ధరలో వినియోగదారులకు అందించనున్నట్లు తెలిపింది.
దేశవ్యాప్తంగా ఉన్న విస్తృతమైన పంపిణీ వ్యవస్థ, రిటైల్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని ఐస్‌క్రీమ్ మార్కెట్లో బలమైన స్థానాన్ని సంపాదించేందుకు RCPL సిద్ధమవుతోంది. వినియోగదారుల అభిరుచులు, అవసరాలపై తమకు ఉన్న అవగాహనతో ‘బాంబే క్రీమరీ’ బ్రాండ్‌ను రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. తద్వారా ప్రీమియం ఐస్‌క్రీమ్‌ను మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
“అందుబాటు ధరలో ప్రపంచ స్థాయి నాణ్యత” అనే సూత్రంతో ఈ కొత్త బ్రాండ్‌ను తీసుకొచ్చినట్లు RCPL తెలిపింది. నాణ్యమైన డెయిరీ పదార్థాలతో తయారు చేసిన ఐస్‌క్రీమ్‌లను వినియోగదారులకు అందించడంతో పాటు, ఈ విభాగంలో దీర్ఘకాలికంగా బలమైన బ్రాండ్‌గా ఎదగాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ ఇప్పటికే పలు ఎఫ్ఎంసీజీ విభాగాల్లో విస్తరిస్తున్న నేపథ్యంలో ఐస్‌క్రీమ్ రంగంలోకి ప్రవేశం మార్కెట్లో ఆసక్తిని పెంచుతోంది.
