డ్యాన్సర్ల కోసం సందీప్ మాస్టర్ కీలక నిర్ణయం

ప్రముఖ కొరియోగ్రాఫర్, ‘ఆట’ ఫేమ్ సందీప్ మాస్టర్ గ్రూప్ డ్యాన్సర్లకు అండగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కొరియోగ్రఫీలో తెరకెక్కే పాటలకు పనిచేసే డ్యాన్సర్ల నుంచి ఇకపై ఎలాంటి కమిషన్ తీసుకోబోనని ప్రకటించారు. ఈ విషయాన్ని తెలుగు ఫిల్మ్ & టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA), చెన్నై యూనియన్ సభ్యులకు అధికారికంగా తెలియజేశారు.

తాను కూడా డ్యాన్సర్‌గా అట్టడుగు స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తినేనని సందీప్ మాస్టర్ తెలిపారు. ఒక డ్యాన్సర్ కెరీర్‌ను నిర్మించుకునేందుకు పడే కష్టం, ఎదుర్కొనే ఇబ్బందులు తనకు తెలుసని చెప్పారు. డ్యాన్సర్ల అంకితభావం, ప్యాషన్, కష్టాన్ని గౌరవించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని, గతంలోనూ తెలుగు, చెన్నై యూనియన్లలో పనిచేసినప్పుడు కమిషన్ తీసుకోలేదని స్పష్టం చేశారు.

తన రాబోయే ప్రాజెక్టులకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని సందీప్ మాస్టర్ వెల్లడించారు. ‘యేషానాగుల’ సాంగ్‌తో పాటు తన తాజా ప్రాజెక్టులకు సహకరించిన అసోసియేషన్ పెద్దలు, డ్యాన్సర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తోటి కళాకారుల శ్రమను గుర్తించి, వారికి పూర్తి పారితోషికం దక్కేలా తీసుకున్న ఈ నిర్ణయంపై డ్యాన్స్ వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Editor