అనంతపురం జిల్లా-కళ్యాణదుర్గం
కుందుర్పి మండలంలోని తెల్లవారుజామున తోటకు వెళ్లిన రైతుపై ఎలుగుబంటి దాడి చేయడంతో తీవ్ర గాయాలైన ఘటన కుందుర్పి మండలం తెనగల్లు గ్రామంలో చోటుచేసుకుంది.
తెనగల్లు గ్రామానికి చెందిన రైతు వెంకటేశులు తెల్లవారుజామున తోటకు వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా ఎలుగుబంటి దాడి చేసింది. ఊహించని విధంగా జరిగిన దాడితో వెంకటేశులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఎలుగుబంట్లు సంచరిస్తుండటంతో పొలాలకు వెళ్లాలంటేనే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని వెళ్లాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో పొలాలకు వెళ్లే రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు.
గ్రామ పరిసరాల్లో వన్యప్రాణుల సంచారం పెరుగుతున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎలుగుబంట్ల సంచారాన్ని అరికట్టి, రైతులు, వ్యవసాయ కూలీలు సురక్షితంగా పొలాలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
వన్యప్రాణుల నుంచి గ్రామస్తులకు రక్షణ కల్పించేందుకు అటవీ శాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని తెనగల్లు గ్రామస్తులు వేడుకుంటున్నారు.
