- హెచ్ఎల్సీ, హంద్రీనీవా నీటి లభ్యతపై అధికారులతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ఉన్నత స్థాయి సమీక్ష..
- ఎల్.నినో నేపథ్యంలో జిల్లాలో రైతులు ఎక్కువ నీరు అవసరమయ్యే వరి, మిరప సాగు చేయవద్దు..
- రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక వాణిజ్య పన్నులు, మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్…
అనంతపురము, ఆగస్ట్ 25 :
సూపర్ ఎల్.నినో వల్ల ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లా తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, జిల్లాలో రైతులు వరి, మిరప సాగు చేయవద్దని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక వాణిజ్య పన్నులు, మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.
కనేకల్ మండలం నల్లంపల్లిలో మంగళవారం సాయంత్రం సూపర్ ఎల్.నినో వల్ల ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో తాగునీటి అవసరాలు మరియు ప్రస్తుత నీటి నిల్వలపై జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, హెచ్.ఎన్.ఎస్.ఎస్, హెచ్.ఎల్.సి, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు అత్యవసర ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి కూలంకషంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రికి అధికారులు వివరిస్తూ తుంగభద్ర డ్యామ్ నుండి 16 టీఎంసీల నీరు కేటాయించడం జరిగిందని, తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఆవిరి నష్టాల (Evaporation Losses) కారణంగా జిల్లా వరకు చేరేసరికి సరాసరి 9 నుంచి 10 టీఎంసీల నీరు అందుతుందని తెలిపారు. అలాగే హెచ్ఎన్ఎస్ఎస్ నుండి కేటాయించిన 4 టిఎంసీల నీటి మోతాదు తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వల దృష్ట్యా ప్రజల తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
తాగునీటి అవసరాలు తీరిన తర్వాత ఏమైనా స్వల్పంగా నీరు మిగిలితే, కనీసం జొన్న, మొక్కజొన్న, కంది వంటి ఆరుతడి పంటలకు అందించే వీలుందా అనే అంశంపై అధికారులతో మంత్రి చర్చించడం జరిగింది. ప్రస్తుతం సాగునీటి విడుదలపై అధికారులు నిస్సహాయత వ్యక్తం చేశారు.
మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఎల్.నినో నేపథ్యంలో జిల్లాలో రైతులు వరి, మిరప సాగు చేయరాదన్నారు. తుంగభద్ర నుంచి వస్తున్న నీరు ప్రస్తుతం జిల్లా తాగునీటి అవసరాలకు సరిపోతోందని, హంద్రీ-నీవా (HNSS) నుంచి తాగునీటిని డ్రింకింగ్ వాటర్ కేటాయింపులకు అనుసంధానించడం, అప్పర్ రీచ్‌లో రక్షణ చర్యలు చేపట్టడం ద్వారా తాగునీటి సమస్య తీర్చవచ్చని తెలిపారు.
నిన్న సోమవారం జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) సమావేశం వాయిదా పడటంతో హంద్రీనీవా ద్వారా నీటి కేటాయింపులపై తుది నిర్ణయం అధికారులు తీసుకోలేకపోయారని తెలిపారు. బోర్డు సమావేశం అనంతరం దీనిపై స్పష్టత రానుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత నీటి ఎద్దడి దృష్ట్యా రైతులు వరి, మిరప వంటి అధిక నీటి వినియోగ పంటలు వేయవద్దని రైతులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని ఆరుతడి లేదా ఇతర ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని కోరారు.
రాబోయే రెండు మూడు రోజుల్లో ‘ఈ-పంట’ ఆధారంగా క్షేత్రస్థాయిలో బోర్వెల్ ఆధారిత పంటల సాగు ఎంత ఉందో, బోర్వెల్ సౌకర్యం లేని సాగు భూములు ఎన్నో స్పష్టమైన డేటా సేకరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రైతులకు, ప్రజలకు నష్టం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
నీటి లభ్యత మరియు విడుదలపై రైతులకు ఖచ్చితమైన సమాచారం చేరవేసేందుకు వాట్సాప్ గ్రూప్‌లు, రైతు సంఘాలు, మరియు గ్రామ స్థాయిలో రెవెన్యూ, వ్యవసాయ శాఖల ద్వారా నిరంతరం కమ్యూనికేట్ చేయాలని మంత్రి ఆదేశించడం జరిగింది. సమగ్ర ప్రణాళికతో పూర్తిస్థాయి అభ్యాసం (abstract) సిద్ధం చేసిన పిమ్మట, అధికారులతో చర్చించి తదుపరి నిర్ణయాలను వెల్లడిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో హెచ్.ఎన్.ఎస్.ఎస్ ఎస్ఈ రాజగోపాల్, హెచ్.ఎల్.సి ఎస్ఈ సుధాకర్ రావు, వ్యవసాయ శాఖ అధికారి సాలు రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
