పసుపుమయమైన పట్టణం.. జనసంద్రంగా మారిన రాయదుర్గం.
యువనేత, మంత్రి నారా లోకేష్ పర్యటన సందర్భంగా రాయదుర్గం పట్టణంలో మంగళవారం పండుగ వాతావరణం నెలకొంది. నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు యువనేతకు అపూర్వ స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో చేసిన విస్తృత ఏర్పాట్లతో ప్రధాన రహదారులు, కూడళ్లు, వీధులు పసుపు జెండాలు, బ్యానర్లు, భారీ ఫ్లెక్సీలతో కళకళలాడాయి.
లోకేష్ రాక కోసం తరలివచ్చిన జనంతో పట్టణం కిక్కిరిసిపోయింది. చేతుల్లో పసుపు జెండాలు పట్టుకుని కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించగా, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో రాయదుర్గం పట్టణం టీడీపీ శ్రేణుల ఉత్సాహానికి ప్రతిబింబంగా మారింది. పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ముందస్తు ప్రణాళికతో స్వాగత కార్యక్రమాలను సమన్వయం చేశారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు తరలివచ్చేలా చర్యలు చేపట్టారు.
మంగళ హారతులతో మహిళల స్వాగతం.. సంప్రదాయ నృత్యాలతో సందడి.
లోకేష్ ర్యాలీ మార్గంలో మహిళలు అడుగడుగునా హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. సంప్రదాయ వస్త్రధారణలో లంబాడీ మహిళలు, మల్లుగోరవయ్యుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డప్పుల మోతలు, సంప్రదాయ కళారూపాలతో ర్యాలీ మార్గం సందడిగా మారింది. ప్రజల అభిమానం, సంప్రదాయ కళల ప్రదర్శన కలగలిసి లోకేష్ పర్యటనకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి.
కరచాలనాలతో.. అభివాదాలతో హుషారు నింపిన లోకేష్
రాయదుర్గం రోడ్‌షోలో మంత్రి నారా లోకేష్ ప్రజలతో మమేకమవుతూ ఉత్సాహం నింపారు. రహదారికి ఇరువైపులా ఉన్న ప్రజలకు చేతులు ఊపుతూ అభివాదం చేశారు. పలువురితో స్వయంగా కరచాలనం చేస్తూ వారి అభిమానాన్ని స్వీకరించారు. లోకేష్‌ను దగ్గరగా చూసేందుకు, కరచాలనం చేసేందుకు యువత, మహిళలు ఆసక్తి చూపారు. ప్రజలకు ఆయన ఇచ్చిన ఆత్మీయ అభివాదాలు, చిరునవ్వులు రోడ్‌షోకు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి.
యువత జోష్.. బైక్ ర్యాలీ హడావుడి.
లోకేష్ రోడ్‌షోలో యువత ఉత్సాహం ప్రత్యేకంగా కనిపించింది. భారీ సంఖ్యలో బైక్‌లపై తరలివచ్చిన యువకులు పసుపు జెండాలతో ర్యాలీగా ముందుకు సాగారు. బైక్‌ల కాన్వాయ్, జై లోకేష్.. జై టీడీపీ నినాదాలతో రహదారులు మార్మోగాయి. యువత ప్రదర్శించిన ఉత్సాహం రోడ్‌షోకు మరింత జోష్‌ను తీసుకొచ్చింది.
ప్రధాన ఆకర్షణగా స్వాగత తోరణాలు.. భారీ ఫ్లెక్సీలు.
లోకేష్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు చిత్రాలతో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కూటమి ప్రభుత్వం యువతకు ఇస్తున్న ప్రాధాన్యత, విద్యా రంగంలో తీసుకొస్తున్న మార్పులను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన సందేశాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ భారీ ప్రచార సామగ్రి పర్యటనకు మరింత రాజకీయ శోభను తీసుకొచ్చింది.
రాయదుర్గంలో లోకేష్‌కు జన నీరాజనం.
నారా చంద్రబాబు నాయుడు పార్క్ నుంచి కనేకల్ రోడ్డు వరకు సాగిన లోకేష్ భారీ రోడ్‌షో జనప్రభంజనాన్ని తలపించింది. వేలాది మంది ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్న ఈ ర్యాలీతో మార్గమంతా కిక్కిరిసిపోయింది. లోకేష్ కాన్వాయ్ ముందుకు సాగుతున్న కొద్దీ ఇరువైపులా ప్రజలు జేజేలు పలుకుతూ, బాణసంచా పేలుస్తూ, నృత్యాలు చేస్తూ స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు భారీ గజమాల వేసి యువనేతను సత్కరించగా, పలుచోట్ల పూలవర్షం కురిపించారు. మహిళలు హారతులతో స్వాగతం పలికారు.
కాలవ శ్రీనివాసులు నాయకత్వంలో, యువనేత కాలవ భరత్ సహకారంతో చేపట్టిన సమన్వయంతో కార్యక్రమం భారీ స్థాయిలో విజయవంతమైంది. అంచనాలకు మించి ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడంతో రాయదుర్గంలో లోకేష్ పర్యటన టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. భారీ జనసందోహం, యువత జోష్, మహిళల హారతులు, సంప్రదాయ కళారూపాలు, పూలవర్షం, బైక్ ర్యాలీ, భారీ స్వాగత ఏర్పాట్లు టీడీపీ శ్రేణుల ఐక్యతకు, ప్రజల్లో నెలకొన్న ఉత్సాహానికి అద్దం పట్టాయి. ముఖ్యంగా స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు నిర్వహించబోతున్న నేపథ్యంలో… లోకేష్ పర్యటన పార్టీ క్యాడర్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. పార్టీ శ్రేణుల్లో 2024 ఎన్నికలనాటి ఉల్లాసం, ఉత్తేజం ఏమాత్రం తగ్గలేదని నిరూపితమైంది. రాబోయే రోజుల్లో ఎలాంటి ఛాలెంజ్ నైనా ఎదుర్కోటానికైన తామంతా ఏకతాటిపై కలసి నడుస్తామనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు.
