అనంతపురం జిల్లా-కళ్యాణదుర్గం తాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలి

ఆర్డీవోకు కాంగ్రెస్ వినతి

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తాగునీటి పథకాల పర్యవేక్షణ లోపంతో ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారని, సమస్య పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో వసంతబాబుకు వినతిపత్రం అందజేశారు.
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఆర్డీవోను కలిసి నియోజకవర్గంలో నెలకొన్న తాగునీటి సమస్యలను వివరించారు. సత్యసాయి, శ్రీరాంరెడ్డి తాగునీటి పథకాల్లో పనిచేస్తున్న సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించకపోవడంతో తరచూ ఆందోళనలకు దిగుతున్నారని తెలిపారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో కృత్రిమంగా తాగునీటి ఎద్దడి ఏర్పడుతోందని పేర్కొన్నారు.
సిబ్బందికి వేతనాలను సకాలంలో చెల్లించి నీటి పథకాలను నిరంతరాయంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో చేతిపంపులు, తాగునీటి బోర్లు మరమ్మతులకు గురైనప్పుడు పాలకవర్గాలు లేకపోయినా అధికారులు చొరవ తీసుకుని వెంటనే మరమ్మతులు చేయించాలని విజ్ఞప్తి చేశారు.
జలజీవన్‌ మిషన్‌ ద్వారా తాగునీటి వసతి కల్పించేందుకు ప్రభుత్వం నిధులు వెచ్చిస్తున్నప్పటికీ కాంట్రాక్టర్లు పనులను సకాలంలో పూర్తి చేయకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. పెండింగ్‌ పనులను త్వరగా పూర్తి చేయించాలని, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని కోరారు.
తాగునీటిని ప్రజల ప్రాథమిక హక్కుగా భావించి అధికారులు స్పందించాలని, వారానికి ఒకరోజు ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించాలని సూచించారు. ప్రతి పంచాయతీలో ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి తాగునీటి సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించి తక్షణమే పరిష్కరించాలని కోరారు.
గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో శ్రీరాంరెడ్డి తాగునీటి పథకానికి రఘువీరారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి చేసిన కృషి వల్లే ప్రస్తుతం ప్రజలకు నీటి వసతి అందుతోందని నాయకులు పేర్కొన్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్న నేపథ్యంలో మున్సిపాలిటీతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.

బైట్ :- రాంభూపాల్
కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్

Posted Under AP
Editor