- మృత్యువులోనూ వీడని బంధం
- రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమార్తె మృతి
- పండగ పూట విషాదం
తన కుమారుడికి ఆరోగ్యం బాగలేనందున చికిత్స కోసం వచ్చిన కుటుంబ సభ్యుల్లో తండ్రి, కుమార్తె మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది.
ద్విచక్ర వాహనంలో వెళుతున్న నలుగురిని ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొనడంతో తండ్రి, కుమార్తె బంధం మృత్యువులోనే వీడలేదు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మఘట్ట మండలం పూలకుంట గ్రామానికి చెందిన సత్యన్న వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కుమారుడు మణికంఠకు ఆరోగ్యం బాగలేనందున చికిత్స చేయించుకునేందుకు రాయదుర్గం పట్టణానికి వచ్చారు. చికిత్స అనంతరం ద్విచక్ర వాహనంలో మధ్యాహ్నం ఇంటికి వెళుతుండగా రాయదుర్గం పట్టణ శివారులోని బీటీపీ రోడ్డులో ఇందిరమ్మ కాలనీ సమీపంలో ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో కుటుంబ సభ్యులందరూ తీవ్రంగా గాయపడ్డారు. తండ్రి, కుమార్తె తలకు బలమైన గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స తర్వాత మెరుగైన చికిత్స కోసం బళ్లారి విమ్స్ వైద్యశాలకు తరలించారు.
మార్గమధ్యంలో తండ్రి సత్యన్న (25) మరణించగా, బళ్లారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కుమార్తె గాయత్రి (5) మృతి చెందింది. భార్య సరస్వతి, కుమారుడు మణికంఠ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. రాయదుర్గం ఎస్సై సురేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఒకే కుటుంబంలో ఇద్దరు మృత్యువాత పడటం, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో పూలకుంట గ్రామంలో తీవ్ర విషాధ ఛాయలు అలుముకున్నాయి.
