రాయదుర్గం ప్రసన్న వెంకటరమణ దేవస్థానం పనుల్లో జాప్యం, విహెచ్పి ఆగ్రహం
రాయదుర్గం పట్టణంలో 500 ఏళ్ల చరిత్ర గల ప్రాచీన శ్రీ ప్రసన్న వెంకటరమణ దేవస్థానం ప్రహరీ గోడ, పుష్కరిణి పునరుద్ధరణ పనుల్లో జరుగుతున్న జాప్యంపై విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు దేవిరెడ్డిపల్లి రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
శుక్రవారం రాయదుర్గంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 2023లో దేవస్థానం అభివృద్ధికి మొత్తం రూ. 4 కోట్ల 15 లక్షలు మంజూరైనా, మూడేళ్లు గడిచినా పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రూ. 2 కోట్ల 65 లక్షలు, ఎండోమెంట్ శాఖ కామన్ గుడ్ ఫండ్ నుంచి రూ. 1 కోటి 20 లక్షలు, స్థానిక భక్తుల మ్యాచింగ్ గ్రాంట్ కింద రూ. 30 లక్షలు విరాళాలు అందినా పనులు ముందుకు సాగడం లేదని తెలిపారు.
దేవస్థానానికి ప్రస్తుతం పాలకమండలి లేకపోవడం, దేవాదాయ శాఖ అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనులు ఆలస్యమవుతున్నాయని ఆరోపించారు. పనుల పురోగతి గురించి అడిగినా ఎవరూ సరైన సమాధానం ఇవ్వడం లేదని భక్తులు ఆందోళన చెందుతున్నారని వివరించారు.
ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావాలంటే అర్ధాంతరంగా ఆగిపోయిన పనులను వెంటనే పునఃప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు చొరవ తీసుకుని బాధ్యులను గుర్తించి పనులు వేగవంతంగా జరిగేలా చూడాలని కోరారు.
ప్రభుత్వం, దేవాదాయ శాఖ వెంటనే స్పందించకుంటే భక్తులతో చర్చించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు విహెచ్పి రాయదుర్గం ప్రధాన కార్యదర్శి మాదుగొండె మల్లికార్జున పాల్గొన్నారు.
