- వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పుష్కలంగా పండాలని ప్రత్యేక పూజలు…
ఆలూరు న్యూస్:- మండల కేంద్రంలోని గుంతకల్లు రోడ్డులో కొలువుదీరిన శ్రీ మారెమ్మ అవ్వ దేవాలయం 17వ వార్షికోత్సవ వేడుకలు గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, కమిటీ నిర్వాహకులు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. వార్షికోత్సవంలో భాగంగా గంగిపూజ, కుంకుమార్చన, అభిషేకం, అమ్మవారికి అలంకరణ, ప్రత్యేక హారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక నైవేద్యం సమర్పించి భక్తులు దర్శించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పుష్కలంగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రత్యేకంగా ప్రార్థించారు. వార్షికోత్సవం సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించడంతో భక్తులతో సందడిగా మారింది. మధ్యాహ్నం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మారెమ్మ భక్తమండలి సభ్యులు చందు, రాము మహానంది, రవి, బుజ్జి, హరి, చిన్న, మంగయ్య, శేఖర్, గోపాల్, కుమార్, అంజప్ప, కోదండ, సాయి లోకేష్, విజయ్, చంద్రయ్య, గుత్తి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
