పెట్రోల్ బంక్ నుంచి జీవిత ఖైదీ పరార్.. పలమనేరులో కలకలం

చిత్తూరు జిల్లా పలమనేరులో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ నుంచి ఓ జీవిత ఖైదీ తప్పించుకోవడం కలకలం రేపింది. హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న సూరి (39) ఆదివారం ఉదయం అధికారుల కన్నుకప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనతో జైళ్ల శాఖ అధికారులు, స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు.

సూరి గతంలో జరిగిన ఓ హత్య కేసులో దోషిగా తేలడంతో న్యాయస్థానం అతడికి జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం కడప సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న అతడి సత్ప్రవర్తనను పరిగణనలోకి తీసుకున్న జైళ్ల శాఖ అధికారులు పునరావాస చర్యల్లో భాగంగా పలమనేరులోని పెట్రోల్ బంక్‌కు తరలించారు. మంచి ప్రవర్తన కనబరిచే ఖైదీలకు జైళ్ల శాఖ ఆధ్వర్యంలోని పెట్రోల్ బంకుల్లో పనులు అప్పగించడం ఆనవాయితీగా ఉంది.

అదే నమ్మకంతో సూరికి కూడా పెట్రోల్ బంక్ నిర్వహణలో భాగంగా బాధ్యతలు అప్పగించారు. అయితే ఆదివారం ఉదయం అక్కడి సిబ్బంది, అధికారుల దృష్టిని తప్పించుకుని అతడు పరారయ్యాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, జైళ్ల శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. సూరి ఎటువైపు వెళ్లాడు, అతడికి ఎవరైనా సహకరించారా అనే కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

Posted Under AP
Editor