ఆస్పత్రిలో అదృశ్యమైన శిశువు క్షేమం
20 నిమిషాల్లో గుర్తించిన సిబ్బంది.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు
అనంతపురం, జూలై 28: అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అదృశ్యమైనట్లు కలకలం రేపిన రెండు నెలల శిశువు సురక్షితంగా లభ్యమైంది. ప్రస్తుతం చిన్నారి ఐసీయూలో చికిత్స పొందుతుండగా, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డా. మల్లీశ్వరి తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లా మామిడాకులపల్లి గ్రామానికి చెందిన పూజిత, అశోక్‌కుమార్ దంపతుల రెండు నెలల కుమార్తెకు ఫిట్స్ రావడంతో ఈ నెల 22న ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్పించారు. మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో చిన్నారి కనిపించడం లేదని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, అవుట్‌పోస్ట్ పోలీసులు ఆస్పత్రి ఆవరణలో గాలింపు చేపట్టి సుమారు 20 నిమిషాల్లో శిశువును గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
సమాచారం అందుకున్న 11వ పట్టణ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో పూజిత అత్తే శిశువును అక్కడ ఉంచినట్లు వెల్లడైనట్లు సమాచారం. అయితే ఈ ఘటనకు గల పూర్తి కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
ప్రస్తుతం చిన్నారి చిన్నారుల వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఐసీయూలో చికిత్స పొందుతోందని, ఆరోగ్య పరిస్థితి సంతృప్తికరంగా ఉందని వైద్యులు తెలిపారు. సమగ్ర శిశు అభివృద్ధి సేవల (ఐసీడీఎస్) అధికారులు కూడా ఆస్పత్రిని సందర్శించి శిశువు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
