అమరావతి ఛాంపియన్‌షిప్–2026 ఆలూరు నియోజకవర్గ స్థాయి అండర్–17, అండర్–23 బాలికల ఎంపిక పోటీలు విజయవంతం
అమరావతి ఛాంపియన్‌షిప్–2026లో భాగంగా ఆలూరు నియోజకవర్గ స్థాయిలో అండర్–17 మరియు అండర్–23 బాలికల ఎంపిక పోటీలు ఈరోజు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించబడ్డాయి. నియోజకవర్గంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ మరియు మోడల్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారిణులు ఈ ఎంపికల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనే ఉత్తమ క్రీడాకారిణులను ఎంపిక చేయాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ ఎంపికల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన బాలికలు జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఎంపిక ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెం.2 హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ప్రశాంతి మేడం, గర్ల్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి సుజాత మేడం, ఏపీ మోడల్ స్కూల్‌కు చెందిన శ్రీ వీరేశప్ప, కే.వీ.కే స్టేడియం వాలీబాల్ కోచ్ శ్రీ ధనుంజయ్ పాల్గొన్నారు. వారు క్రీడాకారిణులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించడం వల్ల శారీరక, మానసిక వికాసం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర, స్థాయిలో విజయాలు సాధించాలంటే క్రమశిక్షణ, నిరంతర సాధన, ఆత్మవిశ్వాసం ఎంతో అవసరమని సూచించారు.
జిల్లా స్థాయికి ఎంపికైన క్రీడాకారిణులకు ముఖ్య అతిథులు అభినందనలు తెలియజేస్తూ, రాబోయే పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఆలూరు నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎంపిక కాలేని క్రీడాకారిణులు నిరాశ చెందకుండా మరింత కష్టపడి సాధన చేస్తే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా క్రీడల ద్వారా యువతలో నాయకత్వ లక్షణాలు, జట్టు భావన, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని అతిథులు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఇలాంటి ఎంపిక పోటీలు మంచి వేదికగా నిలుస్తాయని, ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రీడా కార్యక్రమాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ ఎంపిక పోటీల నిర్వహణలో ఇన్‌చార్జి వీరేష్, కే.వీ.కే స్టేడియం కోచ్ ధనుంజయ్, చిన్నబాబు ,వివిధ పాఠశాలల పీడీలు, పీఈటీలు, క్రీడా ఉపాధ్యాయులు విశేషంగా కృషి చేశారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పీడీలు, పీఈటీలు, క్రీడాకారిణులు, తల్లిదండ్రులు మరియు క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎంపికైన విద్యార్థినులను అభినందించారు.
