తాడిమర్రి( yes9tv )తాడిమర్రిలో వికసిత్ భారత్ గ్రామ్‌జీ (VBGRamG) పథకానికి శ్రీకారం
వర్షపు నీటి సంరక్షణకు వాటర్ హార్వెస్టింగ్ పాండ్ పనుల ప్రారంభం
తాడిమర్రి, జూలై 2: తాడిమర్రి మండలంలోని తాడిమర్రి గ్రామ పంచాయతీ పరిధిలో గురువారం వికసిత్ భారత్ గ్రామ్‌జీ (VBGRamG) పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరనారప్ప పొలంలో వర్షపు నీటి సంరక్షణ కోసం చేపట్టనున్న వాటర్ హార్వెస్టింగ్ పాండ్ నిర్మాణ పనులను మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) వెంకట రంగారావు, ఏపీఓ అనిల్ కుమార్ రెడ్డి, కూటమి నాయకులతో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ కూచి రాము, బీజేపీ మండల కన్వీనర్ రామ్మోహన్, టీడీపీ నాయకులు హర్ష, పక్కీరా రెడ్డి, రంగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీడీపీ కన్వీనర్ కూచి రాము, బీజేపీ కన్వీనర్ రామ్మోహన్ మాట్లాడుతూ, ఎన్‌డీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి బదులుగా వికసిత్ భారత్ గ్రామ్‌జీ (VBGRamG) పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చిందన్నారు. ఈ పథకం ద్వారా గ్రామీణ కూలీలకు సంవత్సరానికి 125 రోజుల ఉపాధి కల్పించడంతో పాటు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ఎక్కువ నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అలాగే 16 ప్రభుత్వ శాఖల సమన్వయంతో గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేపట్టి గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
అనంతరం ఎంపీడీవో వెంకట రంగారావు మాట్లాడుతూ, గ్రామ పంచాయతీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ఆయా పంచాయతీల ద్వారానే గుర్తించి, పనుల అమలులో పంచాయతీల భాగస్వామ్యాన్ని పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు సమకూరుస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఈ పథకం కింద 318 రకాల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. కూలీలకు రోజువారీ వేతనాన్ని రూ.312గా ప్రభుత్వం నిర్ణయించిందని, వ్యవసాయ పనులు అధికంగా ఉండే కాలంలో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విడతల వారీగా రెండు నెలల పాటు పనులకు విరామం ఇవ్వనున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో VBGRamG సిబ్బంది సుధీర్ కుమార్, అరుణమ్మ, గణేష్, వెంకట్రామిరెడ్డి, నరసింహ, కూలీలు, మేట్లు తదితరులు పాల్గొన్నారు.
