: కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్దహోతూరు గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ వేధింపులకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాల్లా బొజ్జమ్మ స్పందించారు. బుధవారం ఆమె బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా బాధితురాలితో మాట్లాడిన బొజ్జమ్మ, ఘటనకు దారితీసిన పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితురాలు మాట్లాడుతూ, స్థానిక నాయకుడు వీరేష్ నుంచి చాలా కాలంగా వేధింపులు ఎదుర్కొంటున్నానని ఆరోపించినట్లు తెలిపారు.
అనంతరం కప్పట్రాల్లా బొజ్జమ్మ మాట్లాడుతూ, బాధితురాలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని సూచించారు. మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ, ఈ అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఘటనలో ఎవరెవరికి సంబంధం ఉన్నా సమగ్ర విచారణ జరిపించి, బాధితురాలికి న్యాయం జరిగే వరకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
అలాగే, బాధిత మహిళకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, మహిళలపై వేధింపులకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు.
