“యూనియన్ అన్ని విధాలుగా అండగా ఉంటుంది” – ఫోన్లో పరామర్శించిన ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు
ఆలూరు, జూన్ 28:
ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిప్పగిరి మండలానికి చెందిన విశాలాంధ్ర రిపోర్టర్ తిమ్మప్పను ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ నాయకులు ఆదివారం పరామర్శించారు. చిప్పగిరి మండలంలోని తిమ్మాపురంలో ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఈ.ఎన్. రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండప్ప, ఐజేయూ జాతీయ సమితి సభ్యుడు కే. నాగరాజు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి బీ. సుంకన్న, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంజి, జిల్లా సహాయ కార్యదర్శి శివ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. ఘోర ప్రమాదం నుంచి బయటపడి ప్రాణాపాయం తప్పించుకోవడం అదృష్టమని పేర్కొన్నారు. తిమ్మప్ప త్వరగా కోలుకుని తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు. యూనియన్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అనంతరం ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు ఫోన్ ద్వారా తిమ్మప్పను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. చికిత్స కోసం రూ.4.50 లక్షలకు పైగా ఖర్చు అయ్యిందని తిమ్మప్ప వివరించగా, సీఎంఆర్ఎఫ్‌కు దరఖాస్తు చేసుకోవాలని, అధికారులతో మాట్లాడి తప్పకుండా సహాయం అందేలా కృషి చేస్తామని ఐవీ సుబ్బారావు హామీ ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా, నియోజకవర్గ కమిటీల ఆధ్వర్యంలో రూ.65 వేల ఆర్థిక సహాయాన్ని తిమ్మప్పకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు స్వరూప్, చంద్రమోహన్, జిల్లా సహాయ కార్యదర్శి శ్రీధర్, తాలూకా ప్రధాన కార్యదర్శి చంద్రబాబు, నాయకులు భీమా, గోపాల్, జెమిని, వీరేశ్, రామ్ మోహన్, బాషా, కృష్ణమూర్తి, నీలకంఠ తదితరులు పాల్గొన్నారు.
