తాడిమర్రి( yes9tv )
తాడిమర్రి, జూన్ 28: పోలియో రహిత భారత్ సాధనే లక్ష్యంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ వై. సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం తాడిమర్రి మండలం నిడిగల్లు గ్రామ ఆరోగ్య కేంద్రంలో పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు చెంచుగార్ల రామాంజనేయులు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ద్వారా భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా నిలబెట్టే మహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
“చిన్ననాటి ఆరోగ్యం బంగారు భవిష్యత్తుకు పునాది” అని పేర్కొన్న ఆయన, ప్రతి చిన్నారికి రెండు పోలియో చుక్కలు వేయించడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి, జీవితంలో పోలియో వంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడకుండా రక్షణ లభిస్తుందని తెలిపారు. ఆరోగ్యవంతమైన చిన్నారులే రాష్ట్ర భవిష్యత్తుకు మార్గదర్శకులని ఆయన అన్నారు.
పోలియో నిర్మూలనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, తమ పరిసర ప్రాంతాల్లోని ప్రతి ఐదేళ్ల లోపు చిన్నారికి పోలియో చుక్కలు వేయించేందుకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ హరిత, ఎంఎల్హెచ్పీ అలేఖ్య, ఆశా వర్కర్ రత్నమ్మ, అంగన్వాడీ సిబ్బంది భూలక్ష్మి, దేవి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బందిని చెంచుగార్ల రామాంజనేయులు అభినందించారు.
పోలియో రహిత భారత్ లక్ష్యంగా పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం
