అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ నిధుల విడుదల.

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ నిధుల విడుదల

*జిల్లాలో 2.75 లక్షల మంది రైతులకు రూ.188.67 కోట్ల జమ*

*రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ

అనంతపురం, జూన్ 20
అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత నిధుల పంపిణీ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. జిల్లాలో మొత్తం 2,75,642 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.188.67 కోట్లు జమ అయ్యాయి.
భారత ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌లోని తారకేశ్వర్ నుంచి పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొనగా, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా లింగంగుంట్ల గ్రామం నుంచి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారు.
జిల్లా స్థాయి కార్యక్రమం బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు, రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ సుబ్బారెడ్డి, ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఎం. కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రూ.137.82 కోట్లు అన్నదాత సుఖీభవ కింద
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ మాట్లాడుతూ, జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.137.82 కోట్లు, పీఎం కిసాన్ కింద రూ.50.85 కోట్లు, మొత్తం రూ.188.67 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.
ఎల్-నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) విధానాన్ని అనుసరించాలని సూచించారు. జీవామృతం, ఘన జీవామృతంతో విత్తన శుద్ధి చేస్తే వర్షాలు ఆలస్యమైనా పంటకు నష్టం ఉండదన్నారు. జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో పీఎండీఎస్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కింద రూ.7 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. రైతు సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి చర్యలతో రైతులకు అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. రాయలసీమలో భారీ స్థాయిలో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
సింగనమలలో రూ.36.59 కోట్ల జమ
సింగనమల నియోజకవర్గ పరిధిలో 54,338 మంది రైతులకు రూ.36.59 కోట్లు జమ చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
చేతల్లో చూపే ప్రభుత్వం
ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం మాటలు చెప్పే ప్రభుత్వం కాదని, చేతల్లో చూపే ప్రభుత్వమని అన్నారు. రైతు అభివృద్ధే రాష్ట్రాభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
కార్యక్రమం ముగింపులో సింగనమల నియోజకవర్గ రైతులకు విడుదలైన రూ.36.59 కోట్ల మెగా చెక్కును ప్రజాప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా ప్రదర్శించారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Posted Under AP
Editor