ఎస్ఐఆర్ కింద 12.83 లక్షల ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ…

*ఎస్ఐఆర్ కింద 12.83 లక్షల ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ*

*జిల్లాలో 62.97 శాతం పంపిణీ పూర్తి – కలెక్టర్ ఓ. ఆనంద్*

అనంతపురం, జూన్ 20:
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)-2026 కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లాలో ఇప్పటివరకు 12,83,631 ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
జిల్లాలో మొత్తం 20,38,523 మంది ఓటర్లు ఉండగా, ఈ నెల 15వ తేదీ నుంచి బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటి సందర్శనలు నిర్వహిస్తూ ఎన్యుమరేషన్ ఫారాలను అందజేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో పనిచేస్తున్న 2,226 మంది బీఎల్ఓలకు ప్రత్యేక శిక్షణ అందించినట్లు తెలిపారు.
శనివారం ఉదయం 8 గంటల వరకు 10,79,398 మందికి ఫారాలు అందజేయగా, సాయంత్రం 6 గంటల నాటికి ఆ సంఖ్య 12,83,631కు చేరిందన్నారు. ఒక్క రోజులోనే 2,04,233 ఫారాలను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. దీంతో జిల్లాలో మొత్తం 62.97 శాతం ఫారాల పంపిణీ పూర్తయిందని తెలిపారు.
ఇక ఫారాల స్వీకరణ విషయానికొస్తే, ఉదయం 8 గంటల వరకు 15,849 పూరించిన ఫారాలు తిరిగి అందగా, సాయంత్రం 6 గంటల నాటికి ఆ సంఖ్య 20,619కు చేరిందన్నారు. శనివారం ఒక్కరోజే 4,770 పూరించిన ఫారాలను స్వీకరించి ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేసినట్లు వివరించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, జూన్ 15 నుంచి జూలై 14 వరకు బీఎల్ఓలు ఇంటింటి సందర్శనలు నిర్వహించి రెండు ఎన్యుమరేషన్ ఫారాలను అందజేస్తారని, అందులో ఒకటి పూరించి తిరిగి అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బీఎల్ఏలు, రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

Posted Under AP
Editor