తాడిమర్రి (yes9tv )రామాపురంలో టీబీ ముక్త్ భారత్ వైద్య శిబిరం విజయవంతం
2030 నాటికి క్షయవ్యాధి రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం – వైద్యాధికారులు
తాడిమర్రి, జూన్ 18: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్టాత్మక కార్యక్రమమైన టీబీ ముక్త్ భారత్‌లో భాగంగా తాడిమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కునుకుంట్ల హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ (HWC), రామాపురం గ్రామంలో మొబైల్ హ్యాండ్‌హెల్డ్ డిజిటల్ ఎక్స్-రే వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
2030 నాటికి దేశాన్ని క్షయవ్యాధి రహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ శిబిరంలో ప్రజలకు క్షయవ్యాధి లక్షణాలు, నివారణ చర్యలు, చికిత్స విధానాలపై విస్తృత అవగాహన కల్పించారు. తాడిమర్రి పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ హరిత ఆదేశాల మేరకు పీహెచ్సీ వైద్య సిబ్బంది, క్షయవ్యాధి నియంత్రణ సిబ్బంది సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా క్షయవ్యాధి సోకే అవకాశం ఉన్న వ్యక్తులకు మొబైల్ హ్యాండ్‌హెల్డ్ డిజిటల్ ఎక్స్-రే ద్వారా 106 మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించారు. క్షయవ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే పూర్తిగా నయం చేయవచ్చని వైద్య సిబ్బంది తెలిపారు. క్షయవ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వం తరఫున ఆరు నెలలపాటు ఉచిత మందులు, పోషకాహార సహాయం అందించబడుతుందని వివరించారు.
ప్రజలు రెండు వారాలకుపైగా దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రామ్‌కుమార్, ఆరోగ్య కార్యకర్తలు జానకి, రాము, ఎంఎల్‌హెచ్‌పీలు విజయలక్ష్మి, ముబిన్, రేణుక, ఏఎన్ఎంలు బాలరాణి, ఆశా కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
క్షయవ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని వైద్య సిబ్బంది పిలుపునిచ్చారు.
రామాపురంలో టీబీ ముక్త్ భారత్ వైద్య శిబిరం విజయవంతం…
