తాడిమర్రి ( yes9tv )తాడిమరి గంగమ్మ దేవాలయంలో రెండున్నర కిలోల వెండి ఆభరణాల చోరీ
తాడిమరి, తాడిమరి గంగమ్మ దేవాలయంలో చోరీ – ఆలయాల భద్రతపై పోలీసుల అప్రమత్తత జూన్ 13: తాడిమరి మండల కేంద్రంలోని తాడిమరి–మరువపల్లి ప్రధాన రహదారిపై కురుబ వీధిలో ఉన్న శ్రీ గంగమ్మ దేవాలయంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని అమ్మవారి అలంకరణకు వినియోగించే దాదాపు రెండున్నర కిలోల వెండి ఆభరణాలను అపహరించినట్లు ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చోరీకి గురైన ఆభరణాలలో అమ్మవారి నాగపడగ, కోరమీసాలు, వెండి గొడుగులు, హస్తాలు (చేతులు) మరియు ఇతర అలంకరణ వెండి వస్తువులు ఉన్నట్లు తెలిపారు. ఈ ఆభరణాల మొత్తం బరువు సుమారు 2.5 కిలోలుగా అంచనా వేస్తున్నారు.
ఫిర్యాదు అందుకున్న వెంటనే తాడిమరి ఎస్‌ఐ కృష్ణవేణి యాదవ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. చోరీ జరిగిన ప్రాంతంలో ఆధారాలను సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలతో విచారణ కొనసాగుతోంది.
ఈ ఘటన నేపథ్యంలో మండలంలోని వివిధ గ్రామాల దేవాలయ కమిటీ సభ్యులు, పూజారులు మరియు సంబంధిత బాధ్యులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ కృష్ణవేణి యాదవ్ మాట్లాడుతూ దేవాలయాల భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ప్రతి దేవాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు రాత్రి వేళల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని సూచించారు. దేవాలయాల పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అలాగే ఆలయాలలోని నగదు, బంగారం, వెండి ఆభరణాలు మరియు ఇతర విలువైన వస్తువులను భద్రంగా భద్రపరచాలని తెలిపారు.
దేవాలయాల భద్రత విషయంలో ప్రజలు, ఆలయ నిర్వాహకులు మరియు పోలీసు శాఖ పరస్పర సహకారంతో అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్‌ఐ సూచించారు. చోరీకి పాల్పడిన నిందితులను త్వరలోనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు.
