శతాబ్దపు విశిష్ట సంప్రదాయం: శ్రీప్రసన్న వెంకటరమణుడి కల్యాణం…

అనంతపురం జిల్లా,రాయదుర్గం.

*శతాబ్దపు విశిష్ట సంప్రదాయం: శ్రీప్రసన్న వెంకటరమణుడి కల్యాణం

*పదేళ్ల బాలికతో వైభవంగా శ్రీవారి వివాహ మహోత్సవం

*’దుర్గం’లో వందేళ్లుగా చెక్కుచెదరని ఆచారం

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీవారి కల్యాణోత్సవం కన్నులపండువగా జరిగింది. శతాబ్ద కాలంగా ఇక్కడ కొనసాగుతున్న విశిష్ట సంప్రదాయం ప్రకారం ఈ ఏడాది కూడా పదేళ్ల బాలికతో శ్రీవారి కల్యాణం వైభవంగా నిర్వహించారు.

*వివాహ తంతు ఇలా:*
స్వామివారి తరపున పెళ్లి పెద్దలుగా బ్రాహ్మణులు, పట్టణ ప్రముఖులు ఉదయం మేళతాళాలతో పెళ్లికూతురు శ్రీ స్వర జాహ్నవి, వయసు 10 సంవత్సరాలు, ను ఊరేగింపుగా మార్కండేయస్వామి ఆలయానికి తీసుకొచ్చారు. అక్కడ వధువును సాంప్రదాయబద్ధంగా అలంకరించి, కోటలోని శ్రీవారి సన్నిధికి ఊరేగింపుగా తోడ్కొని వచ్చారు.

ప్రధాన అర్చకులు వెంకట ప్రసన్నశాస్త్రి ఆధ్వర్యంలో వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య వివాహ కార్యక్రమం జరిపించారు. పెళ్లికూతురిని శ్రీవారి ఉత్సవ విగ్రహం పక్కన కూర్చోబెట్టి జీలకర్ర బెల్లం, కన్యాదానం తదితర ఘట్టాలన్నీ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 11.30 గంటలకు అభిజిత్ లగ్న సుముహూర్తంలో, శుభ పుష్కరాంశమునందు పురోహితులు మంగళసూత్రాన్ని బాలిక మెడకు తాకించి, శ్రీవారి పక్కనే ఉన్న పద్మావతి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి కట్టారు. అనంతరం తల్లి పసుపు కొమ్ముతో కూడిన మంగళసూత్రాన్ని బాలిక మెడలో కట్టడంతో కల్యాణ తంతు సంపూర్ణమైంది.

*ఈ సంప్రదాయం ప్రత్యేకత:*
రాయదుర్గంలో వందేళ్లుగా ప్రతి బ్రహ్మోత్సవాల్లోనూ పద్మశాలి వంశానికి చెందిన ‘అరవ’ కులస్థుల ఇంటి బాలికతో శ్రీవారికి కల్యాణం జరిపించడం ఆనవాయితీ. ఈ ఏడాది కర్ణాటక రాష్ట్రం, విజయనగర జిల్లా, కూడ్లిగి తాలూకా, కానాహొసహళ్లి గ్రామానికి చెందిన అరవా నాగేష్, పావని దంపతుల కుమార్తె శ్రీ స్వర జాహ్నవితో శ్రీవారి వివాహం జరిపించారు.

భక్తుల విశ్వాసం ప్రకారం, ఈ విధంగా శ్రీవారితో వివాహం జరిగిన బాలికకు భవిష్యత్తులో సద్గుణ సంపన్నుడు, ఉత్తముడైన భర్త లభిస్తాడని ప్రగాఢ నమ్మకం. అందుకే ఈ అపురూప అవకాశం కోసం పద్మశాలి కుటుంబాలు ఎంతో భక్తిశ్రద్ధలతో ఎదురుచూస్తాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పట్టణ ప్రముఖులు, వందలాది భక్తులు పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించి తరించారు.

Posted Under AP
Editor