ధర్మవరంలో టీడీపీ శ్రేణుల అసంతృప్తి: కూటమి ఉన్నా సాగని పనులు.. నిరాశలో పరిటాల శ్రీరామ్!

కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. ధర్మవరం దేశం శ్రేణులకు పనులు సున్నా.. ధర్మవరం లో బీజేపీదే రాజ్యం.. నిరాశలో పరిటాల శ్రీరామ్. అనంతపురం.మే 04 రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం శ్రేణులకు పనులు జరగడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో బిజెపి హవా నడుస్తోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్ బిజెపి నేత కావడంతో ఆయన పిఏలు, అనుచరులు, బీజేపీ నేతలు చెబితేనే అధికారులు పనులు చేస్తున్నారు. మంత్రి ధర్మవరం వచ్చినప్పుడల్లా ఆయన వెంట బిజెపి, జనసేన నేతలే కనిపిస్తున్నారు దీంతో టిడిపి శ్రేణులు, పరిటాల శ్రీరామ్ అనుచరులు నిరాశకు గురవుతున్నారు. తమ పరిస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. ఇక పరిటాల శ్రీరామ్ విషయానికొస్తే దివంగత మాజీ మంత్రి పరిటాల రవీంద్ర రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతల వారసుడైన పరిటాల శ్రీరామ్ గత సార్వత్రిక ఎన్నికల్లో ధర్మవరం నుండి పోటీ చేయడానికి తెలుగుదేశం టికెట్ కోసం తీవ్రంగా యత్నించడం జరిగింది. అంతకుమునుపు ఐదేళ్లుగా ధర్మవరం టిడిపి ఇన్చార్జిగా శ్రీరామ్ వ్యవహరిస్తున్నారు. కనుక ధర్మవరం దేశం టికెట్ తనకే దక్కుతుందని శ్రీరామ్ ఆశించారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి తెలుగుదేశం పార్టీని వీడి బిజెపిలోకి వెళ్లడం జరిగింది.2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం లేదా బిజెపి టికెట్ల కోసం ఆయన ప్రయత్నించడం జరిగింది టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో ఆయన అప్పట్లో ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించడం జరిగింది.. విషయం తెలుసుకున్న పరిటాల కుటుంబీకులు సమస్యను తెలుగుదేశం అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. వరదాపురం సూర్యనారాయణకు టికెట్ కేటాయిస్తే అతడి గెలుపుకు తాము ఎటువంటి సహాయం చేయలేమని పరిటాల శ్రీరామ్ ఖరాఖండిగా చెప్పడం జరిగింది. కాగా వారిరువురి నడుమ వైరం ఉండడంతో పరిశీలించిన తెలుగుదేశం హై కమాండ్ ఎవరితోనూ నిష్ఠూరం కాలేక పొత్తులో భాగంగా బిజెపికి ధర్మవరం టికెట్ ను కేటాయించడం జరిగింది.బీజేపీ అధిష్టానం స్థానికేతరుడైన బిజెపి నేత సత్య కుమార్ యాదవ్ కు ధర్మవరం టికెట్ ను కేటాయించడం విధితమే.తనకు దేశం టికెట్ రాకున్నప్పటికి పరిటాల శ్రీరామ్ నిరాశ చెందకుండా బీజేపీ అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ విజయానికి కృషి చేశారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన సత్య కుమార్ యాదవ్ కు మంత్రి పదవి లభించింది.బీజేపీ అభ్యర్థి విజయానికి కృషి చేసిన పరిటాల శ్రీరామ్ కు మాత్రం అన్యాయమే జరిగింది.తన కూటమి ప్రభుత్వంలో కనీసం నామినేటెడ్ పదవి కూడా ఆయనకు దక్కలేదు. ఆయన అనుచరులకు టిడిపి శ్రేణులకు ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు కూడా జరగడం లేదు. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ప్రజా దర్బార్ కార్యక్రమాలు జరుగుతుంటే ధర్మవరంలో ఎందుకు నిర్వహించడం లేదని నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ అయిన పరిటాల శ్రీరామ్ కు తెలుగుదేశం అధిష్టానం ఇటీవల నోటీసు జారి చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో తమ పనులే జరగకుంటే తాము ఏవిదంగా ప్రజా దర్బార్ నిర్వహించాలని ప్రజల నుండి వచ్చే అర్జీలను ఎలా పరిష్కరించాలని పరిటాల శ్రీరామ్ తో పాటు దేశం నేతలు ప్రశ్నిస్తున్నారు.మరి పరిటాల శ్రీరామ్ తో పాటు తెలుగుదేశం శ్రేణులకు ఏవిదంగా న్యాయం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

Posted Under AP
Editor