భూ వివాదాలకు ఇక అడ్డుకట్ట. _ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవ.

అనంతపురం జిల్లా, రాయదుర్గం.

 

భూ రికార్డులన్నీ డిజిటలైజ్ చేయడం వల్ల సరిహద్దు తగాదాలు, ఇతర భూ వివాదాలకు అడ్డుకట్ట పడుతుందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మంజూరు చేస్తున్న రాజముద్రతో కూడిన పాస్ పుస్తకం రైతుకు తన భూమిపై సంపూర్ణ హక్కు కల్పిస్తుందని వెల్లడించారు. రాయదుర్గం రూరల్ మండల పరిధిలోని డి. కొండాపురం గ్రామంలో గురువారం నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… దశాబ్దాల కాలంగా భూ వివాదాలు కొనసాగుతూ వస్తున్నాయన్నారు. వీటితో గ్రామాల్లో వివాదాలు, విభేదాలు, గొడవలు తలెత్తుతున్నాయన్నారు. ముఖ్యంగా అన్నదమ్ములు, రక్తసంబంధీకుల మధ్య భూ సమస్యలు కీలకంగా మారాయన్నారు. కొన్ని కోర్టు కేసుల వరకు కూడా వెళ్తున్నాయని ఆవేదన వ్యక్తపరిచారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రైతులకు రాకూడదన్న దృఢ సంకల్పంతో చంద్రబాబు నాయుడు భూ వివాదాలకు శాశ్వతంగా పరిష్కారం చూపుతున్నారన్నారు. భూములు రీ సర్వే చేయించడంతో పాటు తప్పొప్పులను సరిదిద్ది డిజిటలైజ్ చేయిస్తున్నారన్నారు. మీ భూమి వివరాలను ఎప్పుడు కావాలన్నా ఆన్లైన్లో చూసుకోవచ్చని, వీటి కోసం ప్రభుత్వ కార్యాలయం వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రైతు ఫోటో తో పాటు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాల వల్ల మీకు వాటిపై సర్వాధికారాలు కల్పించడం జరుగుతోందన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ లోపు అన్ని గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేయించి రైతులకు రాజముద్రలతో కూడిన తప్పులు లేని పాసుబుక్కులు ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పమన్నారు. పాస్ పుస్తకాల్లో ఇకమీదట ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో అహర్నిశలు కృషి చేసిన రెవెన్యూ సిబ్బందిని ఆయన అభినందించారు. ఇంకా ఎక్కడైనా సాంకేతిక కారణాల వల్ల పాస్ పుస్తకాలు రాని రైతులు ఉంటే, వారికి తక్షణమే సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు. పాస్ పుస్తకాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని, ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతన్నలకు అండగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో భూములకు మంచి ధర లభిస్తుందని కావునా ఎవరు తమ భూమిని అమ్ముకోవద్దని కాలవ సూచించారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కురుబ హనుమంతు, మాజీ సర్పంచ్ రామ్ముర్తి, తిమ్మారెడ్డి, వన్నూరుస్వామి, సోము, వీరేశ్ తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor