అనంతపురం జిల్లా.
*అమరావతికి చట్టబద్ధతపై అనంతలో అంబరాన్నంటిన సంబరాలు*
– *: ఎమ్మెల్యే దగ్గుపాటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేడుకలు*
– *: టవర్ క్లాక్ వద్ద బాణాసంచా పేలుస్తూ కేక్ కట్ చేసి సంబరాలు*
– *: ఇక అమరావతిని నుంచి ఒక్క ఇటుక కూడా ఎవరు కదిలించలేరన్న ఎమ్మెల్యే*
– అమరావతి రాజధానిగా పార్లమెంటులో 11 గంటల 11 నిమిషాలకు దివ్యమైన ముహూర్తంలో చట్టబద్ధత బిల్లు ప్రవేశపెట్టారని, ఈ బిల్లుకు 11 పార్టీలు మద్దతు తెలిపాయని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. ఏపీకి అమరావతి రాజధానిగా పార్లమెంటులో చట్టబద్ధత లభించిన నేపథ్యంలో బుధవారం అనంతపురం నగరంలో భారీ స్థాయిలో సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ఆధ్వర్యంలో టవర్ క్లాక్ వద్ద ఈ సంబరాలు జరిగాయి. బాణాసంచా కాలుస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కేక్ కట్ చేసి నగరవాసులకు అందజేస్తూ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ ఆరోజు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తే… ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిని లేని రాష్ట్రాన్ని ఒక రూపుకు తెచ్చారన్నారు. బస్సులో నుంచే పాలన సాగిస్తూ అమరావతి నిర్మాణానికి రూపకల్పన చేశారన్నారు. భవిష్యత్తులో ఎవరు అధికారంలోకి వచ్చినా అమరావతి నుంచి ఇటుక కూడా కదిలించకూడదన్న ఉద్దేశంతోనే అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతో వేలాదిమంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారన్నారు. అలాంటి రైతులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోతుందన్నారు. భవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఏపీకి రాజధాని మాత్రం అమరావతిగా మాత్రమే ఉంటుందని ఎమ్మెల్యే దగ్గుపాటి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
