అనంతపురం జిల్లా, రాయదుర్గం.
అమరావతికి ఇక చట్టబద్ధ రక్షణ – ప్రభుత్వ విప్ కాలవ
“అమరావతి ఆంధ్రుల గౌరవాన్ని పెంచే అద్భుత రాజధానిగా మారబోతోందని” ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గంలోని స్వగృహంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పార్లమెంట్‌లో ఈ బిల్లు బుధవారం ఆమోదం పొందడం ద్వారా ఏపీకి అమరావతి ఒకటే ఏకైక రాజధాని అని స్పష్టమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం-2014 ప్రకారం ఆంధ్రులకు దక్కాల్సిన హక్కులను పార్లమెంట్ వేదికగా పునరుద్ఘాటించడం శుభపరిణామన్నారు. గత ఐదేళ్ల అంధకారం తొలగిపోయి, నవ్యాంధ్ర నిర్మాణానికి మళ్లీ పునాది పడిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టుదల, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంపూర్ణ సహకారం, యువ నేత లోకేష్ బాబు వేగం, మేధస్సుతో అమరావతి నగరం అభివృద్ధి దిశగా వేగంగా పరుగులు పెడుతుందన్నారు. తమ హయాంలో అత్యంత అద్భుతమైన, సుందరమైన నగరం రూపుదిద్దుకోబోతుండటం జీవితాంతం గుర్తుండిపోయే ఓ మధురానుభూతి అని, ఒక మైలురాయిగా శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు.
ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి లోక్‌సభ ఆమోద ముద్ర వేయడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు. పారిశ్రామిక, విద్యా, వైద్య, ఇతరత్రా అనేక రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులు ముందుకు వచ్చే అవకాశం ఉందన్నారు. అమరావతి నగర నిర్మాణం తమ నాయకుడు చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జరుగుతుండటం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. విశ్వ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఆంధ్రుడు గర్వపడే మధురక్షణమన్నారు. ఇలాంటి ఆనంద సమయంలో కూడా ఒక విషపక్షం వైసీపీ లోక్‌సభలో తన సభ్యులచే వాకౌట్ చేయించడం అత్యంత దుర్మార్గం, దురదృష్టకరమని ఆవేదన చెందారు. జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక చారిత్రాత్మక తప్పుగా దీనిని చెప్పవచ్చన్నారు. ఒకవైపు అమరావతికి తాము వ్యతిరేకం కాదని చెబుతూనే… మరోవైపు తన పార్టీ సభ్యులచే వాకౌట్ చేయించడం జగన్ పార్టీ రెండు నాలుకల ధోరణికి నిదర్శనమన్నారు. రాజకీయాల్లో ఇలాంటి అవకాశవాద ధోరణి ఎంతో కాలం సాగదని, అందుకే 151 స్థానాలున్న ఆ పార్టీ గత ఎన్నికల్లో 11కు పడిపోయిందన్నారు. ఇంత జరిగినా ఇంకా పశ్చాత్తాపం కనిపించకపోవడం అతని మానసిక దుస్థితిని తెలియజేస్తోందన్నారు.
అమరావతి నగర నిర్మాణానికి 2014లో ప్రధాని నరేంద్ర మోడీ పనులు ప్రారంభించగా 2019 వరకు శరవేగంగా జరిగాయన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ రాక్షస దండు అమరావతిపై కక్షగట్టి పనులన్నీ ఆపివేసి ఆంధ్రుల గౌరవాన్ని దెబ్బతీసే పని చేసిందని ధ్వజమెత్తారు. 2024లో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక పనులు పునఃప్రారంభమై వేగం పుంజుకున్నాయన్నారు. ఇప్పటికే సుమారు రూ. 50వేల కోట్ల విలువైన పనులతో అమరావతి శరవేగంగా పరుగులు పెడుతోందన్నారు. ఉపాధి, ఉద్యోగాలకు కేంద్రంగా, రాష్ట్రానికి అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే ప్రాజెక్టుగా అమరావతి వెలగబోతోందన్నారు. ఎవరూ చూడని అద్భుత, ఆధునిక నగరం సాకారం కాబోతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కేంద్రం చట్ట సవరణ చేయడం పట్ల కూటమి సభ్యులందరం చాలా గర్వపడుతున్నామన్నారు. కేంద్రం చేసిన చట్టసవరణతో రాజధానికి ఒక రక్షణ గోడ లభించినట్లు అయిందన్నారు. భవిష్యత్తులో ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా… రాజధాని జోలికి మాత్రం వెళ్లలేరని ఆయన స్పష్టం చేశారు.
