అనంతపురం జిల్లా.
ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలి…
డిఆర్ఓ ఏ.మలోల
ప్రధాన కేంద్రంలో ముగిసిన ఫీల్డ్ ట్రైనర్ల శిక్షణా తరగతులు.
అనంతపురం, మార్చి 29:
జిల్లాలో చేపట్టనున్న జనగణన 2027 ప్రక్రియను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి మరియు జిల్లా సెన్సెస్ అధికారి మలోల సూచించారు. ఆదివారం సాయంత్రం అనంతపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని కామర్స్ కాన్ఫరెన్స్ హాల్ లో గత వారం రోజుల పాటు మూడు బ్యాచ్ లు గా ఎంపికైన 82 మందికి జన గణనపై ప్రత్యేక శిక్షణ అవగాహన తరగతులను నిర్వహించారు. ఫీల్డ్ ట్రైనర్ల ముగింపు శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమం సందర్భముగా పలు అంశాలపై డిఆర్ఓ తర్ఫీదు పొందిన వారికి పలు అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ప్రస్తుతం శిక్షణ పొందిన శిక్షకులు క్షేత్రస్థాయిలోని ఉద్యోగ, సిబ్బందికి జన గణనపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ రెండు దశల్లో ఉంటుందని, మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన (హెచ్ ఎల్ ఓ) మరియు రెండవ దశలో జనగణన జరుగుతుందన్నారు. ఇంటింటా వెళ్లినప్పుడు డేటా సేకరణ జాగ్రత్తగా సేకరించి నమోదు చేయాలన్నారు. తొలి దశలో భాగంగా ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన నమోదు ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే http://census.ap.gov.in/se అంతర్జాలం నందు స్వీయగణన ద్వారా ప్రజలు తమ వ్యక్తిగత వివరాలు స్వయంగా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియలో ప్రతి ఇంటిని సర్వే చేయాలని ఖచ్చితమైన సమాచారం తీసుకుని నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. జన గణన డేటా సేకరణలో ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించి జన గణనపై వారిలో ఉన్న అపోహలను తొలగించాలన్నారు. గ్రామ మరియు పట్టణ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు మరియు సంక్షేమ పథకాలను అర్హులకు చేరవేయడానికి జనగణన వివరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. గత వారం రోజులుగా నిష్ణాతులైన శిక్షకుల బృందం ఆధ్వర్యంలో మొదటి దశ ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన పై అనేక విషయాల పట్ల అవగాహన కల్పించడం జరిగింది అన్నారు. క్షేత్రస్థాయిలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన వివరాల సేకరణ పై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి దీనిని పూర్తి చేయాలన్నారు. అంతకుముందు ఉదయం స్థానిక ఒకటి మరియు రెండవ రోడ్డు లోని కొన్ని ఇళ్లకు వెళ్లి మొదటి విడతలో సమాచారాన్ని సేకరించే ప్రక్రియను డిఆర్ఓ పర్యవేక్షించారు. అలాగే ముందస్తు అభ్యాస కార్యక్రమంలో భాగంగా ఆయా ఇంటి కుటుంబ పెద్దలతో డిఆర్ఓ మాట్లాడుతూ జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం పై ఎలాంటి సందేహాలు వద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో సెన్సెస్ విభాగం డిప్యూటీ తహసిల్దార్ మధుసూదనరావు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు మరియు మాస్టర్ ట్రైనర్లు జి ఎల్ ఎన్ ప్రసాద్ , కిరణ్, సెన్సెస్ నోడల్ అధికారులు మోహిత్ వర్మ, లక్ష్మీ కళ, మోహన్ ,రమణ మరియు ఎన్నికల విభాగం డిప్యూటీ తాసిల్దార్ కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
